టాలీవుడ్ విలక్షణ నటుడు చలపతిరావు కన్నుమూత
టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. రెండ్రోజుల క్రితం కైకాల సత్యనారాయణ మృతిని మరువక ముందే మరో సీనియర్ నటుడు తమ్మారెడ్డి చలపతిరావు కన్నుమూశారు. 78 ఏళ్ల చలపతి రావు ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఇండస్ట్రీలో అందరూ బాబాయి అని ముద్దుగా పిలుచుకునే చలపతిరావు మరణవార్త టాలీవుడ్‌కు మరో షాక్ న్యూస్ అని చెప్పాల్సి ఉంటుంది. 1200 సినిమాలకు పైగా ఆయన నటించారు. కొంతకాలంగా సినిమా షుూటింగ్‌లకు దూరంగా ఉన్నారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. అలనాటి మేటి నటులతోపాటు, నవతరం నటీనటులతో అద్భుత ప్రదర్శన చేసిన చలపతిరావు… ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. అటు విలనీజం, ఇటు హాస్యం రెండింటి కలబోత ఆయన నటన అని చెప్పుకోవాల్సి ఉంటుంది. చలపతిరావు కృష్ణా జిల్లా బల్లిపర్రులో 1944 మే8న జన్మించారు. చలపతిరావు మొదటి సినిమా గూఢచారి 116. చివరి సినిమా ఓ మనిషి నీవెవరు. చలపతిరావు తనయుడు రవిబాబు నటుడిగా, దర్శకుడిగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సొంతంగా ఏడు సినిమాలను నిర్మించారు.
