Home Page SliderNational

అమరవీరుల దినోత్సవం మార్చి23న ఎందుకు జరుపుకుంటాం?

నేడు మనం అనుభవిస్తున్న ఈ దేశ స్వాతంత్రం ఎందరో త్యాగవీరుల బలిదానం. ప్రాణాలను లెక్కచేయకుండా దేశ స్వాతంత్ర్యం కోసం, ప్రజల సుఖసంతోషాల కోసం పోరాడారు. వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతీ సంవత్సరం మార్చి23న అమరవీరుల దినోత్సవం (షహీద్ దివస్)ను జరుపుకుంటున్నాము. ఈ రోజే ఎందుకంటే 1931లో ఇదే రోజున బ్రిటిష్‌వారిని మూడు చెరువుల నీరు త్రాగించిన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ను ఆంగ్లేయులు ఉరి తీశారు. ఈ ఒక్కరోజే కాదు మహాత్మాగాంధీ వర్థంతి ఐన జనవరి 30 నాడు కూడా అమరవీరుల దినోత్సవం జరుపుకుంటాము. మనదేశంలో ఆరు తేదీలలో వివిధ ప్రాంతాలలో ఈ షహీద్ దివస్‌ను జరుపుకుంటారు.

స్వతంత్ర్య ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన పంజాబ్ కేసరిగా పేరుగాంచిన విప్లవకారుడు లాలాలజపతిరాయ్‌ను పోలీసులు అరెస్టు చేసి, తీవ్రంగా లాఠీచార్జ్ చేయడంతో మరణించారు. అప్పటికి యువకులైన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటివారు లాలాజీ హత్యకు ప్రతీకారం చేయాలని భావించారు. ఈ హత్యకు జేమ్స్ స్కాట్ అనే పోలీస్ సూపరెండెంట్ కారణమని తెలుసుకున్నారు. అతనిని హత్య చేయాలనుకొని, ఢిల్లీలోని అనెంబ్లీపై  భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లు బాంబులు వేశారు. జేమ్స్‌స్కాట్‌గా భావించి, జార్జి శాండర్స్ అనే కానిస్టేబుల్‌ను కాల్చి చంపారు. అనంతరం విప్లవం వర్థిల్లాలి అనే నినాదంతో స్వతంత్ర్య పోరాటాన్ని కొనసాగించారు.

దీనితో మండిపడ్డ బ్రిటిష్ ప్రభుత్వం వీరి ముగ్గురినీ అరెస్టు చేసి, ఉగ్రవాదులుగా ముద్రవేసి, 1931,మార్చి23 వతేదీన లాహోర్ జైలులో ఉరి తీశారు. స్వతంత్ర్యానంతరం వీరు ముగ్గురు అమరవీరుల త్యాగానికి గుర్తుగా ఈ రోజును షహీద్ దివస్‌గా ప్రకటించారు. ఇలాంటి ఎందరో త్యాగఫలితంగా మనకు స్వతంత్ర్యం లభించింది. వారి వీర, పరాక్రమాల గురించి నేటి తరానికి, రాబోయే తరాలకు, కథలుగా చెప్పవలిసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా తమ జీవితాలనే త్యాగం చేసిన వీరులకు నివాళులు అర్పిద్దాం.