రాహుల్ “భారత్ జోడో” యాత్రకు నేడే శ్రీకారం
కాంగ్రెస్‌కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నడుం బిగించారు. ఛిన్నాభిన్నమైన పార్టీ శ్రేణులను, నాయకులను `భారత్ జోడో` యాత్ర ద్వారా మళ్లీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రారంభించారు. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభించే ఈ యాత్రను జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగించాలని నిర్ణయించారు. దేశంలో బీజేపీ ఆధిపత్యాన్ని అడ్డుకునే లక్ష్యంతో బుధవారం సాయంత్రం పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు ఆరు నెలల పాటు కొనసాగే ఈ యాత్ర ద్వారా ప్రజలకు పార్టీని చేరువ చేయాలని రాహుల్ భావిస్తున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఖాదీతో తయారు చేసిన త్రివర్ణ పతాకాన్ని రాహుల్‌కు అందించి యాత్రను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘెల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొంటారు.

మంగళవారం రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్న రాహుల్ గాంధీ బుధవారం ఉదయం 7 గంటలకు శ్రీపెరంబదూరులోని రాజీవ్ గాంధీ స్మారక స్థలం వద్ద నివాళులర్పించారు. అక్కడి నుంచి కారులో తిరిగి చెన్నై వెళ్లిన రాహుల్ విమానంలో తిరువనంతపురం చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కన్యాకుమారికి చేరుకొని అక్కడ సాయంత్రం నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

రోజూ 22-23 కిలోమీటర్ల పాదయాత్ర
భారత్ జోడో యాత్ర రోజూ రెండు బృందాలుగా సాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి పదిన్నర వరకు ఒక బృందం, మధ్యాహ్నం మూడున్నర నుంచి ఆరున్నర గంటల వరకు మరో బృందం కదులుతుంది. రాహుల్ వెంట నడిచే వారిని భారత్ యాత్రీలు అనీ.. స్థానిక కార్యకర్తలను ప్రదేశ్ యాత్రీలు అనీ.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి యాత్రలో పాల్గొనే వారిని అతిథి యాత్రీలు అని పిలుస్తారు. పాదయాత్ర రోజూ సగటున 22-23 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. సెప్టెంబరు 11వ తేదీన కేరళలోకి ప్రవేశించే రాహుల్‌గాంధీ ఆ రాష్ట్రంలో 18 రోజుల పాటు తిరుగుతారు. 30వ తేదీన కర్ణాటకలోకి ప్రవేశించి 21 రోజుల పాటు నడుస్తారు. ఈ పాదయాత్రకు `కలిసి నడవండి – దేశాన్ని ఐక్యం చేయండి` అని ట్యాగ్‌లైన్ పెట్టారు. రాహుల్ గాంధీ పాదయాత్రకు పోలీసులు 3 షిఫ్టుల్లో భద్రత కల్పిస్తున్నారు.

రోడ్డుపైనే భోజనం, నిద్ర
12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల గుండా సాగే రాహుల్ పాదయాత్రలో వివిధ రాష్ట్రాలకు చెందిన 117 మంది కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు. తెలంగాణ నుంచి కేతూరి వెంకటేశ్, సంతోష్, కె.వెంకటరెడ్డి, కత్తి కార్తీక గౌడ్, బెల్లం నాయక్ తెలావ్, అనులేఖ బూస పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సుంకర పద్మశ్రీ పాల్గొంటారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 32 మంది మహిళలు కూడా ఈ పాదయాత్రలో పాల్గొంటారు. 148 రోజుల పాటు సాగే ఈ పాదయాత్రలో 3,570 కిలోమీటర్ల దూరం నడవాలని నిర్ణయించారు. యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ భోజనం, నిద్ర, విశ్రాంతి.. అన్నీ రోడ్డు పక్కనే పూర్తి కానిచ్చేస్తారు. దీని కోసం అన్ని వసతులతో కంటైనర్లను ఏర్పాటు చేశారు. హోటళ్లు, ఏసీ బస్సుల్లో బస చేయరు. పాదయాత్రలో అక్కడక్కడా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటారు.

దేశ చరిత్రలోనే మైలురాయి
`ఇంధ్ర ధనస్సులోని రంగుల్లా వేలాది వర్ణాలు ఒక్కటవుతున్నాయి. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ మన దేశం అనుసంధానమవుతోంది. నేను మీ నగరానికి, మీ గ్రామానికి, మీ వీధికి, మీ దగ్గరికి వస్తున్నాను. మనం కూడా దేశాన్ని ఏకం చేద్దాం` అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ సాగే రాహుల్ పాదయాత్ర దేశ చరిత్రలోనే మైలురాయిగా నిలుస్తుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. దేశంలో విభజనవాద రాజకీయాలు, మతోన్మాదం, పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ప్రజల మధ్య అసమానతలకు వ్యతిరేకంగా గళం, దేశ ప్రజలను ఏకం చేయడం.. వంటి ప్రధాన లక్ష్యాలతో పాదయాత్ర ముందుకు సాగుతుందని పేర్కొన్నాయి.

