National

శ్రీలంక కొత్త అధ్యక్షుడి ఎన్నిక నేడే..!

Share with

శ్రీలంక అంటేనే సిరిగల ద్వీపం అని అర్ధం. శ్రీ అంటే సిరి. శ్రీలంకకు భారతదేశానికి ఉన్నబంధం ఈనాటిది కాదు. రామాయణకాలం నుండి ఉన్నసంబంధం. పరమేశ్వరుని నుండి రావణుడు వరప్రసాదంగా పొందిన లంక అందం, వైభవం వర్ణించాలంటే సుందరకాండలోని హనుమంతుడు దిగి రావలసిందే. అంతటి వైభవోపేతమైన లంక నేడు ఎలాంటి దుస్థితికి చేరుకొందడానికి గల కారణాలను చర్చించుకుందాం. 1972కు పూర్వం శ్రీలంకను…  సిలోను అనే పిలిచేవారు. పూర్వం నుండి బౌద్దమత సంప్రదాయాన్ని పాటిస్తోంది లంక. టీ, కాఫీ, రబ్బరు,కొబ్బరి వంటి ఎగుమతులకు ప్రసిద్దిగాంచింది. కొంతకాలం క్రితం వరకూ బాగానే ఉన్న శ్రీలంక రాజకీయ, సామాజిక, ఆర్దిక పరిస్థితుల కారణంగా చాలా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

శ్రీలంక ఆర్దిక సంక్షోభానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. చైనాతో దోస్తీ చేసి అప్పుల భారాన్ని పెంచుకోవడం, కొవిడ్ కారణంగా టూరిజం మూతపడడం, రాజపక్స విదేశీ విధానాలు, పెరుగుతున్నధరలు, అర్ధంపర్ధంలేని సంక్షేమపథకాలు మొదలైన కారణాలు శ్రీలంకను పూర్తిగా అప్పులో నెట్టేశాయి. బుల్లిద్వీప దేశాన్ని దివాలా అంచున నిలిపాయి. గంటల తరబడి కరంటు కోతల కారణంగా ఫాక్టరీలు మూతపడడం, ప్రజలు చీకట్లో మగ్గిపోవడం, అప్పుల భారం పెరిగిపోవడం, ఇలా అనేక కారణాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. 2007 లో అధ్యక్షుడిగా ఉన్నరాజపక్స ప్రభుత్వం బాండ్లను మార్కెట్‌లో అమ్మకానికి పెట్టారు. ఈ ఋణాలే ఇప్పుడు 38 శాతం శ్రీలంక ఋణాలయ్యాయ్. చైనాకు విపరీత ప్రాధాన్యం ఇచ్చి… చైనా నుండి ఎక్కువ అప్పులు చేసి తీర్చలేక హంబన్‌టోట పోర్టును చైనాకు 99 ఏళ్ల లీజుకు ఇచ్చేశారు. 2005 నుండి, 2015 మధ్యకాలంలో చైనా నుండి తీసుకున్నఋణం 14 బిలియన్ డాలర్లు. గత మూడేళ్లలో లంక ఆర్ధిక వ్యవస్ధ అతి దారుణంగా దెబ్బతింటూ వస్తోంది. టూరిజంపై ఎక్కువ ఆధారపడిన శ్రీలంక కరోనా వల్ల భారీగా నష్టపోయింది. ప్రజలు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో… కొనలేక తిండికి కూడా కరువై ప్రభుత్వాలపై తిరగబడే పరిస్థితి వచ్చింది. ఇక ఇంధన ధరలను భరించలేక ప్రజలు వాహనాలకు స్వస్తి చెప్పారు.  

గత 10 -15 రోజులలో శ్రీలంకలో విపరీత రాజకీయపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు, తిరుగుబాటుదారులు, అధ్యక్షభవనంపై దాడి చేయడం, అధ్యక్షుడు గొటబయ రాజపక్స విదేశాలకు పారిపోవడం జరిగిపోయాయ్. శ్రీలంక ప్రజల ఆగ్రహ జ్వాలలకు తట్టుకోలేని గొటబయి రాజపక్స సతీసమేతంగా మొదట మాల్దీవులకు… ఆ తర్వాత సింగపూర్‌కు పలాయనం చిత్తగింతచాల్సి వచ్చింది. దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు గొటబయ రాజపక్స సింగపూర్ నుంచి రాజీనామా లేఖను ఈమెయిల్ ద్వారా పార్లమెంట్ స్పీకర్ మహింద అభయవర్ధకు పంపించారు.  ప్రధానమంత్రి రణిల్ విక్రంసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. శ్రీలంక కొత్త అధ్యక్షుడెవరనేది నేడు తేలనుంది.

కాగా శ్రీలంక సంక్షోభంపై నిన్న భారత్‌లో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది.  ఎందుకంటే ఈసంవత్సరం శ్రీలంకకు భారత్ ప్రధాన ఆర్ధిక వనరుగా ఉంది. ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు భారత్ సహాయసహకారాలు ఎంతో అవసరం. శ్రీలంక రైతులకు మద్దతు, ఆహార భద్రత కోసం ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకోవడానికి చర్చలు జరుగుతున్నాయ్. పొరుగు దేశాన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకోడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.

.