పాత బాస్ కోసమే ఆ ప్రాజెక్టు ఆపారు
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ‘పాత బాస్’ చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకునేందుకే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అటకెక్కించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు . అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు పూర్తయితే మాజీ సీఎం కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న భయంతో పాటు, చంద్రబాబుకు కోపం వస్తుందన్న ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి పనులను నిలిపివేశారని కేటీఆర్ అన్నారు . కేవలం 45 టీఎంసీల నీటి కేటాయింపులకు అంగీకరించడం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని మండిపడ్డారు.
జీహెచ్‌ఎంసీ విభజనపైన కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆర్థిక ప్రయోజనాల కోసం, బ్రోకర్ల సలహాలతో నగరాన్ని మూడు ముక్కలు చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని, దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని హెచ్చరించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందిస్తూ.. నిఘా వ్యవస్థలు నెహ్రూ కాలం నుంచే ఉన్నాయని, ప్రస్తుతం ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ కావడం లేదని ముఖ్యమంత్రి హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. విచారణలు, సిట్‌ల పేరుతో ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లిస్తోందని విమర్శించిన ఆయన.. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల ఫలితాలే కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై ప్రజా తీర్పు అని ఉద్ఘాటించారు.

