సినీషూటింగ్‌లు ఆపే ప్రశ్నే లేదు-ఫిల్మ్‌ఛాంబర్
కరోనా విలయతాండవం తర్వాత అన్ని రంగాలతో పాటు సినీరంగానికి కూడా బాగా కోలుకోలేని దెబ్బ పడింది. థియేటర్లు మూసివేయడం, షూటింగ్‌లు ఆగిపోవడం , టికెట్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం వంటి కారణాల వల్ల పెద్ద నిర్మాతలు, హీరోలకు అంత ఎఫెక్టు లేకపోయినా చిన్న నిర్మాతలు సినీ కార్మికుల జీవితాలలో చాలా విధ్వంసం జరిగింది. ఇప్పుడిప్పుడే కొంత కోలుకుంటున్న సినిమాల విషయంలో ఓటీటీ రిలీజ్‌ల కారణంగా మళ్లీ క్రుంగిపోతున్నాయి. ఈసమస్యల పరిష్కారాలకు, విజయాల శాతం పెంచడంతో పాటు పరిశ్రమ మనుగడకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి కొన్ని రోజులుగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ప్రయత్నిస్తున్నారు. నేడు ఫిలిం ఛాంబర్ సినీ ప్రముఖుల ఈ విషయంపై భేటీ అవుతున్నారు. అన్ని విషయాలపై మధ్యాహ్నం 3 గంటలకు ఛాంబర్ సమావేశం ఏర్పాటు చేసారు. కానీ నిన్ననే ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశమై ఆగస్ట్ 1 నుంచి షూటింగ్ లను ఆపేస్తున్నట్లు మీడియాకు ప్రకటన ఇచ్చింది.

ఈ సందర్బంలో ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు ఈ రోజు సమావేశమౌతున్నారు. సినిమా షూటింగ్‌లు ఆపేస్తే చాలామంది కార్మికులకు కష్టమౌతుందని, పెద్ద హీరోల సినిమాలు షూటింగ్‌లలో ఉన్నాయని ఫిల్మ్‌ఛాంబర్ భావిస్తోంది. ఈ సమావేశానికి గిల్డ్ సభ్యులను ఆహ్వానించారు. సమావేశానికి గిల్డ్ సభ్యుల రాకపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఫిల్మ్ ఛాంబర్ ను గిల్డ్ సభ్యులు పట్టించుకోవడం లేదు. దీనితో గిల్డ్ కు ఎటువంటి అధికారాలు లేవని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తెలియజేస్తోంది. ఫిల్మ్ ఛాంబర్ చెప్పేదే అంతిమ నిర్ణయమని, గిల్డ్ షూటింగ్స్ ఆపేస్తే వారి కే నష్టం అనీ చెపుతున్నారు. కానీ తెలుగు సినీ పరిశ్రమ షూటింగ్స్ అపటం జరగదని ఛాంబర్ తెలియజేసింది. రాబోయే సినిమాలలో చిరంజీవి, ప్రభాస్, అల్లుఅర్జున్ సినిమా పుష్ప-2, జూనియర్ ఎన్టీఆర్, పవన్‌కళ్యాణ్ వంటి పెద్ద హీరోల సినిమాలన్నీ షూటింగ్‌లలో ఉన్నాయి.