యమునానది ఇంకా డేంజర్ మార్క్ పైనే..ఆందోళనలో ఢిల్లీ వాసులు
యమునానది వరద ఇంకా ఢిల్లీని వీడలేదు. ఇప్పటికీ డేంజర్ మార్క్ పైనే కొనసాగుతోంది. ఈ ఉదయానికి 205.45 మీటర్ల స్థాయిలో యమునానది ప్రవాహం ఉంది. దీనితో భారీ వర్షాల కారణంగా ఎప్పుడైనా ఈ మార్క్‌ను దాటుకుని మహోగ్రరూపాన్ని దాటవచ్చనే ఆందోళనలో ఉన్నారు ఢిల్లీ వాసులు. సోమవారం 206.56 మీటర్ల ఎత్తున ప్రవహిస్తున్న యమునానది ప్రవాహం కారణంగా నది పరివాహక ప్రాంతాలలోని ప్రజలను ఇప్పటికే ఖాళీ చేయించారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలోని పలు ప్రాంతాలు గత వారం కురిసిన భారీ వర్షాల కారణంగా ఇంకా ముంపులోనే ఉన్నాయి. ముఖ్యమైన రహదారులు, ఎర్రకోట, సుప్రీంకోర్టు, మెయిన్ బజార్ ప్రాంతాలలో నిలువ ఉన్న నీటిని యంత్రాల సహాయంతో తొలగించారు. ఎగువ నుండి భారీగా వరద వస్తూండడంతో ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది యమున. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా కురుస్తున్న వర్షాలకు హర్యానాలోని హత్నికుండ్ బరాజ్ నుండి ప్రభుత్వం 2 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసింది. దీనితో ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా ప్రవాహం 205.75 మీటర్లకు చేరింది.

