Breaking Newshome page sliderHome Page SliderNational

ముంబైలో ఠాక్రేల ఓటమి.. రాజ్‌తో కలయికే ఉద్ధవ్‌కు శాపమా..?

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఠాక్రే రాజకీయానికి గట్టి షాక్ ఇచ్చాయి. గత రెండున్నర దశాబ్దాలుగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ (బీఎంసీ)పై అజేయంగా కొనసాగిన ఠాక్రే కుటుంబం ఈసారి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 20 ఏళ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు కలిసినా.. ముంబై కోటను కాపాడుకోలేకపోయారు. ఈ ఓటమికి ప్రధాన కారణాలుపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి రాష్ట్రవ్యాప్తంగా ఘన విజయాలు నమోదు చేసిన నేపథ్యంలో , బీఎంసీ ఫలితాలు ఠాక్రే బ్రదర్స్ కలయికపై అనేక సందేహాలను లేవనెత్తాయి. ఉద్ధవ్ ఠాక్రే సొంత పార్టీ శివసేన 213 స్థానాల్లో 160 స్థానాల్లో పోటీ చేసి 74 సీట్లు గెలుచుకుంది. స్ట్రైక్ రేట్‌ 46 శాతం. మరోవైపు రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన 53 స్థానాల్లో పోటీ చేసి కేవలం 8 సీట్లకే పరిమితమైంది. స్ట్రైక్ రేట్‌ కేవలం 15 శాతమే. ఈ గణాంకాలే ఈ కూటమి ఉద్ధవ్‌కు లాభం కంటే నష్టమే ఎక్కువ చేసిందని రాజకీయ నివేదికలు నివేదిస్తున్నాయి.
రాజ్ ఠాక్రే గతంలో అనుసరించిన అతివాద మరాఠీ ధోరణి ఈ ఎన్నికల్లో కీలకంగా మారిందని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరాఠీ మాట్లాడని వారిపై దాడులు, పరభాషా విద్వేషం వంటి అంశాలు ముంబైలోని మరాఠీయేతర ఓటర్లను భయభ్రాంతలుకు గురిచేశాయి .మరోవైపు ఫలితంగా ఉత్తర, దక్షిణ భారతీయులతో పాటు మైనారిటీ వర్గాలు ఉద్ధవ్ కూటమి నుంచి దూరమయ్యారని బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు అంచనా వేస్తోంది. ఎంఎన్‌ఎస్‌ నుంచి కొంత ఓటు బదిలీ జరిగినా , ఇతర వర్గాల ఓట్లు కోల్పోవడంతో ఉద్ధవ్ తన పాత కంచుకోటలను కూడా నిలబెట్టుకోలేకపోయింది.

ఇదే సమయంలో మహా వికాస్ అఘాడీని పక్కన పెట్టి కాంగ్రెస్‌కు దూరంగా ఉండడం మరో వ్యూహాత్మక తప్పిదంగా మారిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ముంబైలో కాంగ్రెస్‌కు ముస్లింలు, మరాఠీయేతర వర్గాల్లో బలమైన పట్టు ఉంది. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసి ఉంటే , బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశముండేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్సీపీ ఈ కూటమిలో ఉన్నప్పటికీ ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం గమనార్హం.

అయితే , దివంగత బాల్ ఠాక్రే రాజకీయ వారసత్వాన్ని కాపాడుకునేందుకు ఉద్ధవ్ చేసిన ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే వైపు మరాఠీ ఓటర్లు మళ్లడం, రాజ్ ఠాక్రే కారణంగా ఇతర వర్గాల ఓట్లు దూరం కావడం ఉద్ధవ్ భవిష్యత్తును మరింత సవాలుగా మార్చింది. ఠాక్రే రాజకీయానికి ఇది టర్నింగ్ పాయింట్‌గా మారుతుందా అన్నది వేచి చూడాల్సిందే.