ఇకపై అన్నింటికీ ఒకటే ఛార్జర్
ప్రస్తుతం మన జీవితంలో స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్‌లో ఒక భాగమయ్యాయి. మనం ఎక్కడికైనా వెళ్లినప్పుడు లేదా ఇంట్లో వీటికి ఛార్జింగ్ చేయాలనుకున్నప్పుడు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లకు ఛార్జర్ లేకుంటే మనం ఇబ్బందిపడడం చూశాం… అప్పుడు మన దగ్గర్లో ఉన్న ఏదైనా ఎలక్ట్రానిక్ షాప్‌కి వెళ్ళి ఛార్జర్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది.. అయితే ఇలాంటి వాటన్నింటికీ చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం కామన్ ఛార్జర్ విధానం తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ ఇలా.. గ్యాడ్జెట్ ఏదైనా ఒకటే ఛార్జర్ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఆగస్టు 17న కీలక సమావేశానికి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. మొబైల్ తయారీ కంపెనీలు, ఆయా రంగంతో సంబంధం ఉన్న సంస్థలు ఈ సమావేశంలో పాల్గొనాలని ఆ శాఖ తెలిపింది.
మరోవైపు.. ఛార్జర్ల సమస్యకు చెక్ పెడుతూ ఇటీవల యూరోపియన్ కీలక నిర్ణయం తీసుకుంది. టైప్-సి పోర్ట్ కలిగిన ఛార్జింగ్ ప్రమాణాలను పాటించాలని సూచించింది. అమెరికాలో కూడా ఇలాంటి డిమాండ్లు వస్తున్నాయి. ఈ ప్రమాణాలను భారత్‌లో సైతం పాటించే దిశగా సమావేశం నిర్వహించనున్నట్లు ఆ శాఖ తెలిపింది. మొత్తానికి కామన్ ఛార్జర్ తీసుకొస్తే భారం తగ్గడంతో పాటు ఛార్జర్ సమస్యకు చెక్ పెట్టే అవకాశం ఉంది.