శాస్త్ర పరిశోధనల ద్వారానే దేశానికి గుర్తింపు-మంత్రి కొండా సురేఖ
యువ పరిశోధకులు, శాస్త్రవేత్తల సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ‘జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ ప్రభావవంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం మాదాపూర్ లోని అవాస హోటల్ లో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి వర్క్ షాప్ ముగింపు కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మంత్రి కొండా సురేఖకు సాదర స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ‘Fauna of Kawal Tiger Reserve’, ‘Fauna of Amrabad Tiger Reserve’, తమిళంలో రాసిన‘Kadal Vanna Meen Valarppu: vanigam matrum payanaligalin pangu పుస్తకాలను మంత్రి సురేఖ ఆవిష్కరించారు. మంత్రి సురేఖ చేతుల మీదుగా పలువురికి సర్టిఫికెట్లు, ప్రైజ్ లను నిర్వాహకులు అందించారు. అనంతరం “అడ్వాన్సెస్ ఇన్ ఫిష్ సిస్టమాటిక్స్: మార్ఫోలాజికల్ అండ్ మాలిక్యులర్ అప్రోచెస్” సబ్జెక్ట్ పై మంత్రి సురేఖ ప్రసంగించారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ సంయుక్తంగా రెండు రోజులు పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ వర్క్ షాప్ లో భాగస్వామిని అయినందుకు గర్వంగా వుందని మంత్రి అన్నారు. ఈ వర్క్ షాప్ కు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలతో పాటు మరెంతో మంది ఫిష్ సైంటిస్టులు, యువ నిపుణులు హాజరవ్వడం సంతోషాన్నిచ్చిందని మంత్రి తెలిపారు.

జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన ‘Fauna of Kawal Tiger Reserve’, ‘Fauna of Amrabad Tiger Reserve’ పుస్తకాల్లో పేర్కొన్న విషయాలు కవ్వాల్ టైగర్ రిజర్వ్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లతో పాటు తెలంగాణలోని అటవీ జంతువుల సంరక్షణ దిశగా తెలంగాణ అటవీ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టేందుకు ఊతమిచ్చేవిగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ‘Freshwater Fishes of River Godavari’ పుస్తకం అంతరించిపోతున్న మత్స్య జాతుల పై అధ్యయనానికి, ఆక్వాకల్చర్ (చేపల సాగు) విధానాలను తెలుసుకోవడానికి, మరో పుస్తకం ‘state fishes’ పుస్తకం సాధారణ జనాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా పుస్తక కూర్పులో భాగస్వాములైన జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు పుస్తక రచయితలందరిని మంత్రి అభినందించారు.

ఈ రెండు రోజుల వర్క్ షాప్ లో చేపల శరీర నిర్మాణం, వాటి స్వరూపస్వభావాలకు సంబంధించి నిపుణులు వెలువరించిన విషయాలు యువ పరిశోధకుల జ్ఞాన తృష్ణను తీర్చి ఉంటాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ జ్ఞాన సంపదతో పరిశోధకులు జీవవైవిధ్య పరిరక్షణకు పాటుపడేలా తమ పరిశోధనలు సాగించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ వర్క్ షాప్ ను విజయవంతంగా నిర్వహించినందుకుగాను జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరక్టర్‌ని మంత్రి కొండా సురేఖ అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ గారితో పాటు అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

