వణికిస్తున్న మాండూస్ తుఫాన్
ఏపీలో మాండుస్ తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర జిల్లాల రైతులను ఈ తుఫాను వణికిస్తోంది. 2018లో వచ్చిన గజ తుఫాను, 2020లో వచ్చిన నివర్ తుఫానుల కంటే మాండుస్ తుఫాను బలమైందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అందుకు తగినట్టుగానే కోస్తాంధ్ర జిల్లాల వ్యాప్తంగా భారీ వర్షాలు ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా తీర ప్రాంత మండలాల్లో 40 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. ఇప్పటివరకు చెప్పుకోదగ్గ నష్టం ఏమి సంభవించినప్పటికీ తుఫాను తీరం దాటిన తర్వాత దాని ప్రభావం మరింత బలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. తీర ప్రాంతాల్లో సముద్రం 50 మీటర్ల మేర ముందుకు రావడమే కాకుండా మామూలు కన్నా ఎత్తుగా అలలు ఎగిసిపడుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. అలలు ఎగిసి పడటంతో ఆయా ప్రాంతాల్లో బీచ్ ల సందర్శనాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పార్కులను మూసివేసింది. తుఫాన్ ప్రభావంతో చోటు చేసుకునే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని నెల్లూరు ,చిత్తూరు తో సహా పలు జిల్లాల్లో పాఠశాలలకు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. నెల్లూరు జిల్లాలో తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఆ జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తుఫానుకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం తో సమీక్షలు నిర్వహిస్తున్నారు.

తిరుపతి జిల్లాలో కూడా తుఫాను ప్రభావం ఉండే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో ప్రజలకు సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు తుఫాను ప్రభావంతో చలిగాలులు ఎక్కువగా ప్రారంభమవటంతో ప్రజలు వణికి పోతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు అవస్థలు ఎక్కువగా అయ్యాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు తుఫాను దృష్ట్యా ప్రజల అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండి అంబేద్కర్ సూచించారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు తుఫాన్ కదలికలను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాల యంత్రంగానికి సూచనలు జారీ చేస్తున్నారు. మత్స్యకారులను వేటకు వెళ్ళద్దని సూచించారు. ప్రభావం చూపే జిల్లాల్లోని 210 మండలాల్లో అధికారుల అప్రమత్తమయ్యారు. తుఫాను రైతుల గుండెల్లో గుబులు రేగుతుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వరి కోతలకు సిద్ధంగా ఉన్న పంటలకు, ఇప్పటికే నూర్పీల్లు పూర్తి అయ్యి ఆరబెట్టిన ధాన్యానికి తుఫాను తీరని నష్టం చేసేలా ఉందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను భయంతో కొన్నిచోట్ల హడావుడిగా వరి కోతలు పూర్తిచేసి ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. తుఫాను ప్రభావం వల్ల వర్షాలు కాకుండా గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున ఇంకా కోత దశకు రాని వరి పంట నేలకు ఒరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

