NewsTelangana

భగ్గుమంటున్న పటాసుల ధరలు

హైదరాబాద్ : మనసర్కార్:

జంటనగరాలలో దీపావళి సందడి మొదలయ్యింది. ఎక్కడ చూసినా మట్టి ప్రమిదలు, ముగ్గుల రంగులు, పూలు, పటాసులు, స్వీట్స్ దర్శనమిస్తున్నాయి.  బట్టల షాపులు, షాపింగ్ మాల్స్ బాగా బిజీగా మారాయి. అయితే పఠాసులు పట్టుకుంటేనే భగ్గుమంటున్నాయి. వాటి రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ బాణసంచా సామాగ్రి ధరలు ప్రతీదీ దాదాపు 40 శాతం ధరలు పెరిగినట్లు వర్తకులు చెబుతున్నారు. క్రాకర్స్ షాప్‌ల ఏర్పాట్ల కోసం జింఖానా గ్రౌండ్‌లో 35 షాపులకు ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారులు పర్మిషన్ ఇచ్చారు. అలాగే బల్దియా పరిధిలోని 6 జోన్లలో 60 మున్సిపల్ గ్రౌండ్స్‌కు అనుమతినిచ్చారు. అక్కడ క్రాకర్స్ షాపులు ఏర్పాట్లు చేసుకోవచ్చు. దీనితో శుక్రవారం నుండి పటాసుల అమ్మకాలు, కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.

ఈ సంవత్సరం షాపుల లైసెన్స్ రేట్లను కూడా భారీగా పెంచారు. గతంలో 5 వేల రూపాయలలోపు ఉండే రిటైల్ లైసెన్స్‌రేట్లు  ఇప్పుడు 10 వేలకు పెరిగింది. ఇక హోల్‌సేల్ షాపులకు 20 వేల నుండి 50 వేల రూపాయల వరకు పెరిగింది. తమిళనాడు శివకాశి నుండి వచ్చే లారీ లోడ్ 3 లక్షలు కాగా, అది ఇప్పుడు దాదాపు 4 నుండి 5 లక్షల వరకూ పెరిగింది. జీఎస్టీ, డీజిల్ రేట్ల పెరుగుదల వల్ల ఇవి కూడా పెరిగినట్లు నిర్వాహకులు చెప్తున్నారు. దీనివల్ల పటాసుల రేట్లు కూడా రెండు రెట్లు పెరిగాయి. పటాసులతో మెట్రో రైలుప్రయాణం నిషేధిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో అధికారులు తెలియజేశారు. రూల్స్ పాటించనివారిపై చర్యలు తీసుకుంటామన్నారు.