ప్రజలంతా బీజేపీ వైపే…
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోలింగ్ బూత్ సమ్మేళన కార్యక్రమంలో బీజేపీ నేత, హూజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురాటమే లక్ష్యమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు అనే నమ్మకంతోనే రెండుసార్లు కేసీఆర్ కి అధికారం కట్టబెట్టారన్నారు. రెండవసారి గెలిచిన తర్వాత కెసిఆర్ కి అహంకారం పెరిగిందని ఈటల విమర్శలు గుప్పించారు.

ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసి మూడు నెలల పాటు మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయలేదన్నారు.ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయడం చూసి ప్రజలు అసహ్యించుకుంటారన్నారు. 2018 ఎన్నికల్లో కెసిఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. మానిఫెస్టోలో పెట్టిన హామీలు కూడా తీరలేదు. యువత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నదే ఉద్యోగాల కోసం. కానీ ఉద్యోగ కల్పనలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం అయ్యిందని దుయ్యబట్టారు. ధరణి తీసుకువచ్చి పేదల భూములకు ఎసరు పెట్టారని మండిపడ్డారు. లీటరు పెట్రోలు మీద కేంద్రం మీద వేసే పన్ను 19.50 రూపాయలు అయితే, రాష్ట్రం వేసే పన్ను రూ. 40.55 పైసలు. మనం ప్రజా సమస్యల మీద ఉద్యమం చెయ్యాలని ఈటల పిలుపునిచ్చారు. ఏది ఏమైనా ఈసారి కెసిఆర్ ను గద్దె దింపాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆ సత్తా కాంగ్రెస్ కు లేదు అని ప్రజలంతా బిజెపి వైపు చూస్తున్నారు. ఆ బాధ్యత మనం తీసుకోవాలన్నారు. ఈసారి గెలిచేది కేసీఆర్ డబ్బులు సంచులు కాదు. ధర్మం, న్యాయం అని పేర్కొన్నారు.


