పొంచివున్న ‘ సిత్రాంగ్ ’ తుఫాను
భారీగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. ఇప్పటివరకు కురిసిన వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలు తీవ్రమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నిలువ నీడ లేక తినడానికి తిండి లేక పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. ఇదిలా ఉండగానే మరో తుఫాన్ ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర అండమాన్ తీరంలో ఉపరితల ఆవర్తనంగా ఏర్పడి 20వ తేది నాటికి తీవ్ర వాయుగుండంగా.. ఆ తర్వాత తుఫానుగా మారుతుందని తెలిపింది. అయితే ఈ తుఫానుకు ‘సిత్రాంగ్’ అని పేరు కూడా పెట్టింది. థాయ్ భాషలో సిత్రాంగ్ అంటే వదలనిది అర్థం. ఇకపోతే దీని ప్రభావంతో ఏపీ , తెలంగాణ , ఒడిశా , పశ్చిమ బెంగాల్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. నిన్న మొన్నటి వరకు కురిసిన వర్షాల ప్రభావంతో అల్లాడుతున్న ప్రజలకు మళ్లీ ముంచెత్తడానికి వస్తున్నఈ తుఫాన్ వార్త తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తుంది.

