స్పీకర్ చేతిలో ఆ పదిమంది ఎమ్మెల్యే ల భవితవ్యం
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు పంచాయితీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడం, మరోవైపు మంత్రివర్గ విస్తరణ, కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్న సమయంలో, బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై ఈ నెల 19వ తేదీలోపు స్పీకర్ తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.బీఆర్‌ఎస్ నాయకులు ఈ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ గతంలో స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ సకాలంలో స్పందించకపోవడంతో వారు హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ ఏడాది జులై 31న ఈ ఫిర్యాదులపై మూడు నెలల్లో తేల్చాలని స్పీకర్‌ను ఆదేశించింది. ఆ గడువులోపు విచారణ పూర్తి కాకపోవడంతో నవంబర్‌లో సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇది కోర్టు ధిక్కారంగా పరిగణించవచ్చని హెచ్చరించింది.స్పీకర్ ఇప్పటికీ 8 మంది ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేసి, నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు – దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు రెండు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ, వారు వివరణ ఇవ్వడానికి మరింత సమయం కావాలని కోరారు. సుప్రీంకోర్టు విధించిన గడువు ఈ నెల 19వ తేదీకి ముగియనుండడంతో, ఈ లోగా స్పీకర్ ప్రసాద్ కుమార్ తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. దీంతో, ఈ 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యంపై ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది.

