ఇంటిని పక్కకు జరిపిన రైతు..!
ఆ రైతు కోటిన్నర రూపాయలు ఖర్చు చేసి ఓ డ్రీమ్ హౌస్‌ను నిర్మించుకున్నాడు. రెండంతస్తుల ఆ భవనాన్ని అపురూపంగా చూసుకుంటున్నాడు. రోడ్డు పక్కనే ఉన్న ఆ ఇంటిని చూసిన వారంతా మెచ్చుకున్నారు కూడా. అయితే, ఆ మార్గం గుండా ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇంటిని కూల్చాలని నిర్ణయించింది. దానికి నష్టపరిహారం ఇచ్చేందుకూ అంగీకరించింది. కానీ ఆ రైతు ససేమిరా అన్నాడు. తన ఇంటినే మరో చోటకు తరలించాడు. ఈ ఘటన పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా రోషన్‌వాలా గ్రామంలో జరిగింది. పంజాబ్ ప్రభుత్వం హర్యానా, పంజాబ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలకు నేరుగా ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించాలని నిర్ణయించింది. ఆ మార్గం కోసం ఇంటిని కూల్చడం ఇష్టంలేని రైతు సుఖ్‌వీందర్ సింగ్ తన ఇంటిని చక్రాల వంటి గేర్ల సాయంతో వెనక్కి జరిపారు. 250 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టిన ఈ ఇంటిని ఏకంగా 500 అడుగుల దూరం జరిపారు. తన ఇంటి నిర్మాణానికి రూ.1.5 కోట్లు ఖర్చయిందని, దాన్ని కూల్చడం ఇష్టం లేక వెనక్కి జరిపానని చెప్పారు.

