News

అరావళి అంతం.. మనుగడకు సంకటం

  • పర్యావరణ కవచంపై మైనింగ్ వేటు
  • ఎడారి కోరల్లో ఉత్తర భారతం!
  • 90శాతం కొండలు కనుమరుగయ్యే అవకాశం !
  • అరావళి రక్షణకు ఉవ్వెత్తున ప్రజా ఉద్యమం!
  • భారతదేశ జాగ్రఫీ మారుతుందా?

భారతదేశ పర్యావరణ వ్యవస్థలో వెన్నెముక వంటి అరావళి పర్వత శ్రేణులు ప్రస్తుతం ఒక అస్తిత్వ పోరాటాన్ని ఎదుర్కొంటున్నాయి. సుమారు 2 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ కొండలు, ఉత్తర భారతదేశానికి రక్షణ గోడలా నిలుస్తున్నాయి. గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు 700 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ శ్రేణులు, నేడు మైనింగ్ మాఫియా నిర్వాకాలు , ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన కొన్ని నిబంధనల వల్ల ముక్కలైపోతున్నాయి. ఈ వినాశనం ఇలాగే కొనసాగితే భారతదేశ భౌగోళిక ముఖచిత్రమే మారిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అరావళి ప్రాంతంలో మైనింగ్ మాఫియా ఎంత శక్తివంతంగా ఉందో చెప్పడానికి గతంలో జరిగిన సంఘటనలే సాక్ష్యం. ఇక్కడ మైనింగ్‌ అనేది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, అది ఒక పెద్ద నేర సామ్రాజ్యంగా మారింది. 2022లో హర్యానాలోని నుహ్ జిల్లాలో అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడానికి వెళ్లిన డీఎస్పీ సురేందర్ సింగ్ను మైనింగ్ మాఫియా ట్రక్కుతో తొక్కించి అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే, రాజస్థాన్‌లోని అల్వార్ ప్రాంతంలో అక్రమ మైనింగ్ వల్ల సుమారు 31 కొండలు భూమిపై ఆనవాళ్లు లేకుండా మాయమైపోయాయని గతంలో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సుప్రీంకోర్టుకు నివేదించింది. సరిస్కా టైగర్ రిజర్వ్ వంటి రక్షిత అడవుల్లో కూడా అటవీ అధికారులపై నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి.

అరావళి విషయంలో సుప్రీంకోర్టు ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది. మే 9, 2024న జస్టిస్ బి.ఆర్. గవాయ్ , జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం “అన్ని కొండలు అరావళీలు కావు” అని వ్యాఖ్యానించింది. ముఖ్యంగా 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న కొండలను రక్షిత పరిధి నుండి తొలగించి, అక్కడ మైనింగ్‌కు వెసులుబాటు కల్పించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. అరావళిలో మొత్తం 12,000 కొండలు ఉంటే, అందులో కేవలం 1,048 (9 శాతం ) మాత్రమే, 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నాయి. అంటే ఈ నిబంధన అమలైతే 90% అరావళి ప్రాంతం మైనింగ్ మాఫియాకు అప్పనంగా దొరికినట్లే అవుతుంది. అయితే, పరిస్థితి తీవ్రతను గమనించిన కోర్టు, జూలై 10, 2024న మరోసారి స్పందిస్తూ,అక్రమ మైనింగ్‌పై కఠినంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించడం కొంత ఊరటనిచ్చిందని చెప్పవచ్చు .

అరావళి వినాశనాన్ని అడ్డుకోవాలని ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పర్యావరణ వేత్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తూ, అరావళి లేకపోతే ఢిల్లీ “గ్యాస్ చాంబర్”లా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హర్యానాలోని గురుగ్రామ్ , ఫరీదాబాద్ ప్రాంతాల్లో ప్రజలు కిలోమీటర్ల మేర మానవ హారాలు నిర్మించి, మైనింగ్‌ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజస్థాన్‌లోని గిరిజన తెగలు తమ జీవనాధారమైన కొండలను కాపాడుకోవడానికి క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా #SaveAravalli అనే నినాదం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది.

ఒకవేళ మైనింగ్ ఇలాగే కొనసాగితే, భారతదేశ భౌగోళిక చిత్రం భయంకరంగా మారిపోతుంది. రాజస్థాన్‌లోని థార్ ఎడారి నుండి వచ్చే ఇసుక తుఫానులను అరావళి కొండలే అడ్డుకుంటున్నాయి. ఇవి లేకపోతే ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ప్రాంతాలు ఎడారిగా మారిపోతాయి. అంతేకాకుండా, అరావళి కొండలు ఒక భారీ ‘స్పాంజ్’ లాంటివి. ఇవి వర్షపు నీటిని భూమిలోకి ఇంకించి గ్రౌండ్ వాటర్ లెవల్స్ పెంచుతాయి. ఇవి మాయమైతే ఉత్తర భారతంలో చుక్క నీరు దొరకని భయంకరమైన నీటి కొరత ఏర్పడుతుంది. అడవులు లేని కారణంగా వేసవిలో ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేని విధంగా 55 డిగ్రీల వరకు చేరే ప్రమాదం ఉంది.

అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేయడం ఆపాలి. ప్రభుత్వం , న్యాయస్థానాలు రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కంటే పర్యావరణానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎత్తుతో సంబంధం లేకుండా అరావళి శ్రేణి మొత్తాన్ని “నో మైనింగ్ జోన్ ,”గా ప్రకటించాలి. మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలి. అరావళిని కాపాడుకోవడం అంటే కేవలం కొండలను కాపాడుకోవడం కాదు, కోట్లాది మంది భారతీయుల భవిష్యత్తును, మనుగడను కాపాడుకోవడమే.