Andhra PradeshHome Page Slider

ప్రాణాలకు తెగించి యువతిని కాపాడిన ఏఆర్ కానిస్టేబుల్ ను అభినందించిన డీజీపీ

అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన యువతిని ప్రాణాలకు తెగించి రక్షించిన ఏఆర్ కానిస్టేబుల్ అంగాని వీరబాబును సోమవారం మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ కేవీ రాజేంద్ర నాథ్ రెడ్డి అభినందించి నగదు బహుమతిని అందజేశారు. వీరబాబు పేరును ప్రధానమంత్రి జీవన్ రక్షా పతకం సిఫార్సుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 17వ తేదీన యానం గోదావరి ఎదురులంక బ్రిడ్జిపై నుండి దూకి ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అదే సమయంలో అమ్మమ్మ అంత్యక్రియలో పాల్గొనేందుకు అటుగా వెళుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ అంగాని వీరబాబు గమనించి 40 అడుగులకు పైగా లోతులో ప్రవహిస్తున్న గోదావరి నదిలోకి దూకి యువతిని కాపాడి ఒడ్డుకు చేర్చి తల్లిదండ్రులకు అప్పగించాడు.