NationalNewsNews Alert

కూర్పు కుదిరింది.. కేబినెట్ కొలువయ్యింది

Share with


బీజేపీని వద్దనుకున్నాడు. ఎన్.డీ.ఏకి దూరమయ్యాడు. ఆర్జేడీతో జతకట్టాడు. మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. కేబినెట్ ను విస్తరించాడు. ఇవన్నీ వారం రోజుల్లో చకచకా జరిగిన పరిణామాలు. ఇప్పుడు పాత సీసాలో కొత్త సారాలా .. బీహార్ కేబినెట్ కొలువుదీరింది. ఎవరో ఒకరిద్దరు మినహా అన్ని పాత ముఖాలే. ఓ బంధాన్ని తెంపుకున్నా .. ఇంకో బంధాన్ని కలుపుకుని పాలనా పగ్గాలు చేపట్టాడు నితీష్ కుమార్. పీఠం ఎక్కాలంటే అన్నీ తీసి పక్కన పడేయాల్సిందే. ఇదే సూత్రాన్ని పాటించాడు కాబట్టే మళ్ళీ సీఎం పదవి అలంకరించగలిగాడు. సిద్ధాంతాలు వల్లించడానికే కాని ఆచరించడానికి కాదు అని నిరూపించిన నేత నితీష్. అధికారం కోసం ఎవరితోనైనా చేతులు కలుపుతాడు. ఏ పార్టీని అయినా కలుపుకుంటాడు. ఇదే అతని అజెండా. ఎన్నిసార్లు ఎంతమందితో జట్టు కట్టినా పట్టుమని ఐదేళ్ళు వారితో కొనసాగింది బహు అరుదు. ఇప్పుడు రాష్ట్రీయ జనతాదళ్ తో జట్టుకట్టి సర్కార్ ను ఏర్పాటు చేశాడు. కొత్త కొలువులో ఈసారి మంత్రి పదవులు ఎక్కువగా ఆర్జేడీకే లభించాయి.

బీహార్ లో కొత్త మంత్రి మండలి కొలువు దీరింది. ముఖ్యమంత్రిగా 8వసారి ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికి గడిచింది రెండేళ్ళే. ఇంకా మూడేళ్ళు పదవిలో కొనసాగాలి. కాదు.. పదవిని నిలుపుకోవాలి. అందుకు అనుసరించాల్సిన మార్గాల గురించి ప్రత్యేకంగా నితీష్ కు ఎవ్వరూ చెప్పనక్కర లేదు. ఆయనకు పీఠం ఎక్కడం ఎలాగో బాగా తెలిసిన విద్యే. నిన్న మొన్నటి వరకు బీజేపీతో అధికారాన్ని పంచుకున్న ఆయన వారం రోజుల్లోనే సీన్ మొత్తాన్ని మార్చేశాడు. రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించి .. ఆర్జేడీతో కలిసి మళ్ళీ అధికార పీఠం ఎక్కాడు. ఉప ముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనేక కసరత్తుల తర్వాత ఇవాళ పూర్తిస్ధాయిలో కేబినెట్ ఏర్పాటయ్యింది. భాగస్వామ్య పక్షాలు అందరినీ సంతోష పెట్టే రీతిలో మంత్రివర్గ కూర్పు చేశారు. ఇందులో ఎక్కువ బెర్తులు ఆర్జేడీకే లభించాయి. మొత్తం 31 మంది ఉన్న మంత్రివర్గంలో 16 మంది మంత్రులు ఆర్జేడీకి చెందిన వారు కాగా.. 11 మంది మాత్రమే జేడీయూ సంబంధించిన వారు ఉన్నారు. అత్యంత కీలకమైన హోంశాఖను తనవద్దే ఉంచుకున్న నితీష్ .. తేజస్వీ యాదవ్ కు వైద్య ఆరోగ్య శాఖతో పాటు రోడ్లు, అర్బన్ డెవలప్ మెంట్, హౌసింగ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ శాఖలను కేటాయించారు. ఇక తేజస్వీ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు పర్యావరణ శాఖను అప్పగించారు.


జేడీయూ నుండి తిరిగి పదవులు పొందిన వారిలో మహ్మద్ జమాఖాన్, జయంతి రాజ్, షీలాకుమారి, సునిల్ కుమార్, సంజయ్ ఝా, మదన్ సాహ్ని, శ్రావణ్ కుమార్, అశోక్ చౌదరి, లెస్సీ సింగ్, విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర యాదవ్ తదితరులు ఉన్నారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు లభించాయి. అలాగే జతిన్ రామ్ మాంఝాకుచెందిన హిందుస్తానీ అవామీ మోర్చాకు చెందిన ఒకరికి, ఇండిపెండెంట్ శాసన సభ్యుడు ఒకరికి కూడా నితీష్ కేబినెట్ లో బెర్తులు లభించాయి. కొత్త క్యాబినెట్‌లో ఐదుగురు ముస్లిం ఎమ్మెల్యేలకు చోటు లభించింది. యాదవులకు గణనీయంగా ఏడు పదవులు దక్కాయి. సంఖ్యాబలం రీత్యా మొత్తం 36 మంది మంత్రులను తీసుకునే అవకాశం ఉన్నా.. ప్రస్తుతం కేవలం 31 మందికే మంత్రి పదవులు లభించాయి. ఇంకా ఐదుగురును చేర్చుకునే అవకాశాలను త్వరలో పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో కంటే ఇప్పుడున్న కూటమి ద్వారా నితీష్ అసెంబ్లీలో తన బలాన్ని బాగా పెంచుకున్నారు. ప్రస్తుతం నితీష్ సర్కార్ కు 164 మంది శాసన సభ్యుల మద్దతు ఉంది. ఈనెల 24న ఆయన అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. అప్పుడు ఎదురయ్యే పరిస్ధితులను ముందుగానే అంచనా కట్టినట్టు కొన్ని మంత్రి పదవులను ఎవరికీ కేటాయించకుండా రిజర్వులో ఉంచారు.


ఇప్పుడు లక్ష్యం మారింది. పూర్తి కాలం పదవిలో కొనసాగాలంటే తాయిలాలు ప్రకటించాల్సిందే. అదే చేశారు నితీష్.. యువ‌త‌కు ఉద్యోగాలు క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల ఉద్యోగావకాశాలు క‌ల్పించ‌డ‌మే ప్ర‌స్తుతం త‌మ ప్ర‌భుత్వం ధ్యేయ‌ంగా ప్రకటించారు. ప్రైవేట్‌, ప్ర‌భుత్వ రంగాల్లో ఖాళీల‌ను కూడా త్వరలో భ‌ర్తీ చేస్తామ‌ని అన్నారు. మ‌హాకూట‌మిలో ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని పైకి చెబుతున్నా.. ఇన్ని పార్టీలను సంతోషం పెట్టడం అంటే మాటలు కాదు. ముఖ్యంగా ఆర్జేడీ చెప్పినట్టు నడుచుకోవడం నితీష్ కు తప్పనిసరి. ఏమాత్రం వారికి వ్యతిరేక నిరణయాలు తీసుకున్నా .. మళ్ళీ పరిస్ధితి మొదటికి రావడం ఖాయం. ఇప్పుడు అన్ని రకాలుగా ఆయనకు కత్తి మీద సాములా మారింది. అందరినీ నెగ్గుకు రావడం.. అందరినీ కలుపుకు పోవడం మాటలు కాదు. అందులోనూ ఆర్జేడీని తృప్తి పరుస్తూ అడుగులు వేయడం నితీష్ కు కష్ట సాధ్యమే అంటున్నారు.