NewsTelangana

మోసపోతే గోసపడతాం

Share with

24 గంటలూ అత్యుత్తమ విద్యుత్‌ అందించే రాష్ట్రం తెలంగాణా అని అన్నారు సీఎం కేసీఆర్‌. వికారాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించారు. కలెక్టరేట్‌లో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నేపల్లిలో కలెక్టరేట్‌కు 34 ఎకరాల భూమి కేటాయించగా రూ. 60.70 కోట్లతో నిర్మాణం చేపట్టారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు డా. సబితా ఆనంద్‌, ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి పలువురు నాయకులు పాల్గొన్నారు.  

వికారాబాద్‌ బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ… ఆసరా, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్‌లతో ప్రజలను ఆదుకుంటున్నామని, ఈ పథకాలు మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా లేవన్నారు. ఎకరానికి 10 వేల రూపాయలు పంట పెట్టుబడి తీసుకుంటున్న ఇండియాలో ఒకే ఒక రైతు తెలంగాణ రైతు. రైతులకు ఉచిత కరెంటే కాదు, ప్రాజెక్టులు ఉన్న చోట ఉచితంగా నీరు అందిస్తున్నాం. గతంలో ఉన్న నీటి బకాయిలు కూడా రద్దు చేశాం. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా కూడా పదిరోజులు తిరగకముందే రైతు భీమా కింద రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని, ఏ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా.. ఎవరికీ లంచాలు పొందే అవకాశం లేకుండా నేరుగా బెనిఫీషియరీ అకౌంట్‌లో జమ అవుతున్నాయి.

తెలంగాణను గుంట నక్కలు వచ్చి పీక్కు తినకుండా ప్రజలు జాగ్రత్తపడాలన్నారు. మోసపోతే గోసపడే పరిస్థితులు వస్తాయని చెప్పారు. రైతు బంధు వంటి పథకాలు ఉచిత పథకాలని, వాటిని రద్దు చేయాలని కోరుతున్నారు. బీజేపీ జెండాను చూసి మోసపోతే ఉచిత కరెంటు ఉండదు. బావుల వద్ద మోటార్లకు మీటర్లు పెట్టే పరిస్థితి వస్తుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

సీఎంకు నిరసన సెగ

మరోవైపు.. సీఎం గో బ్యాక్‌ అంటూ ప్లకార్డులు పట్టుకుని రాఘవన్‌ నాయక్‌ నిరసన తెలిపారు. రాష్ట్ర అఖిల భారత గిరజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు రాఘవన్‌ నాయక్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వికారాబాద్‌ జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్లీ ఇక్కడకు వస్తున్నారంటూ రాఘవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు మూడెకరాల భూమి, 12 శాతం రిజర్వేషన్లు హమీలు ఎక్కడ అని ప్రశ్నించారు. నిరసన తెలియజేస్తున్న ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్‌కి తరలించారు.