పెరిగిన పాల ధర.. సామాన్యుడు విలవిల
కరోనా కారణంగా దేశంలో నిత్యావసరాల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని తాకాయి. మరోవైపు పెట్రోల్,డీజిల్,వంటగ్యాస్ ధరలు కూడా భగ్గుమంటున్నాయి. ఇప్పటికే భారీగా పెరిగిన ధరల నేపథ్యంలో దేశ ప్రజలు ఇప్పటికే అల్లాడుతున్నారు. ముఖ్యంగా సామాన్యుడికి బ్రతుకు బండి భారంగా మారిందనే చెప్పాలి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా పెరిగిన పాల ధరతో దేశ ప్రజల నెత్తిన పెనుభారం పడింది.
దేశంలోని ప్రముఖ బ్రాండ్లలో ఒక్కటిగా ఉన్న Amul, Mother Dairy వంటి సంస్థలు తమ పాల ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించాయి. ఇకపై లీటర్ పాలపై రూ.2/- మేర పెంచుతున్నట్లు ఆ సంస్థల యాజమాన్యాలు తెలిపాయి. పెంచిన ఈ ధరలు బుధవారం నుంచి అమలు కానున్నాయి. దీంతో మూలిగే నక్క మీద తాటికాయ పడిందన్న చందంగా సామాన్యుడి పరిస్థితి తయారైంది. ఒక ప్రక్క పెరిగిన నిత్యావసరాల ధరలతో అల్లాడుతున్న సామాన్యుడికి ఇప్పడు పెరిగిన పాల ధరలు నడ్డి విరుస్తున్నాయి.