Andhra PradeshBreaking Newshome page sliderHome Page Slider

మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

అమరావతి :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో మదనపల్లె, రంపచోడవరం (పోలవరం), మార్కాపురం ప్రాంతాలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామంతో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 26 నుండి 28కి పెరిగింది. జనవరి 1వ తేదీ నుండి ఈ కొత్త జిల్లాలు అధికారికంగా ఉనికిలోకి రానున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల విభజనలోని లోపాలను సరిదిద్దుతూ, భౌగోళిక పరిస్థితులు ప్రజల సౌకర్యార్థం ఈ మార్పులు చేపట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన మార్కాపురం జిల్లా ఏర్పాటుతో ఆ ప్రాంత వాసుల ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ప్రస్తుతం కలెక్టరేట్‌కు వెళ్లాలంటే సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మార్కాపురం , కనిగిరి రెవెన్యూ డివిజన్లను కలుపుతూ, యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాలతో సుమారు 11.42 లక్షల జనాభాతో ఈ జిల్లా రూపుదిద్దుకోనుంది. అలాగే, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం రంపచోడవరం కేంద్రంగా ‘పోలవరం జిల్లా’ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు ఎంతగానో దోహదపడనుంది.
రాయలసీమ ప్రాంతంలో అన్నమయ్య జిల్లాకు సంబంధించి కీలక మార్పు చోటుచేసుకుంది. భౌగోళిక పరిపాలనా కారణాల దృష్ట్యా జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుండి మదనపల్లెకు మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మదనపల్లె , కొత్తగా ఏర్పడిన పీలేరు రెవెన్యూ డివిజన్లను కలిపి జిల్లాగా మారుస్తున్నారు. మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలు ఈ జిల్లా పరిధిలోకి రానున్నాయి. జిల్లా కేంద్రం మార్పుపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కొంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, పరిపాలనా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వం వివరించింది. రాయచోటి అభివృద్ధికి ప్రత్యేకంగా సహకరిస్తామని ఈ సందర్భంగా మంత్రులు హామీ ఇచ్చారు. కొత్తగా ఏర్పడే ఈ మూడు జిల్లాలకు సంబంధించి ఇప్పటికే తాత్కాలిక భవనాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. శాశ్వత ప్రాతిపదికన కలెక్టరేట్ కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వం త్వరలోనే నిధులను విడుదల చేయనుంది. కొత్త ఏడాది కానుకగా జనవరి ఒకటి నుంచి ఈ జిల్లాల పాలన ప్రారంభం కానుంది.