Andhra PradeshHome Page Slider

వైయస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల లో టెన్షన్ టెన్షన్

Share with

ప్రజలతో మమేకమయ్యేందుకు వైయస్సార్సీపీ 8 కార్యక్రమాలు
ఈ నెల 25 నుంచి సామాజిక బస్సు యాత్రలతో మొదలు
దాదాపు 5 నెలలపాటు జనంలోనే ఉండేలా కార్యక్రమాలు
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొదలైన రహస్య సర్వే టెన్షన్

ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అధికార వైయస్సార్సీపి వ్యూహాత్మక కార్యక్రమాలకు పొదును పెట్టి గెలుపే లక్ష్యంగా నిత్యం ప్రజల్లోనే ఉండే విధంగా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. జగనన్న ఆరోగ్య సురక్ష, ఏపీకి జగనే ఎందుకు కావాలి, బస్సు యాత్రలు, ఆడుదాం ఆంధ్ర వంటి కార్యక్రమాలతో క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు వైఎస్ఆర్సీపీ భారీ ప్రణాళికలు రూపొందించింది. ఈనెల 25 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రతిక్షణం జనం మధ్య ఉండే విధంగా తీరికలేని కార్యక్రమాలు చేపడుతుంది. ఈ మేరకు విజయవాడలో పార్టీ నేతలు క్యాడర్ కు ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు.

ఇదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై కూడా సర్వేలు నిర్వహిస్తున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో సర్వేల టెన్షన్ మొదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ మండల స్థాయి నుంచి మంత్రుల వరకు ప్రజా ప్రతినిధులతో విజయవాడలో భారీ సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికే తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగడంతో పాటు మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు జరగనుండటంతో జగన్ జోరు పెంచారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జైల్లోనే ఉండటంతో ఆ పార్టీకి క్యాడర్ నిరాశ నిస్పృహాల్లో ఉంది. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపడుతుంది. దీంతో ఓట్ల తొలగింపు, రానున్న ఎన్నికలకు సమాయత్తం వంటి కార్యక్రమాలకు ఆ పార్టీ దూరమైపోయింది.

మరోవైపు చంద్రబాబు ఎంత కాలం జైల్లో ఉంటారనే విషయంపై స్పష్టత లేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ వచ్చిన ఇతర కేసుల్లో సమస్యలు రావని గ్యారెంటీ లేదు. అంగళ్లు కేసుతో తో పాటు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ కేసులు బాబు మెడ పై వేలాడుతున్నాయి. ఇదే అదునగా భావించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వరకు దాదాపు 5 నెలలపాటు తమ పార్టీ నాయకులు ప్రజల్లోనే ఉండేందుకు పక్కా ప్రణాళికలతో కార్యక్రమాలు చేపట్టారు. మరోసారి అధికారంలోకి రావాలంటే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. అంతేకాకుండా ప్రజల మధ్యకు ఎలా వెళ్లాలి అందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనేది కూడా రూట్ మ్యాప్ తయారు చేశారు. ప్రతి ఒక్కరు ప్రతి ఇంటిని టచ్ చేసే విధంగా కార్యక్రమాలను రూపొందించడం గమనార్హం. ఇదిలా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలలో మాత్రం ప్రస్తుతం టెన్షన్ మొదలైంది.

ప్రజలలో మంచి పేరు ఉండి బలమైన నేతలకి ఈసారి టికెట్లు ఇస్తానని పదేపదే జగన్ చెప్పడంతో ఆ దిశాగా ఆయన సర్వేలు నివేదికలు తెప్పించుకోవటంతో వారిలో మరింత ఎక్కువ టెన్షన్ కనపడుతుంది. ఎన్నికల వరకు నాయకులు ప్రజల్లోనే ఉండబోతున్న తరుణంలోనే ఎవరికి తెలియకుండా రహస్యంగా ఎమ్మెల్యేలపై సర్వే చేయుస్తున్న జగన్ ఈ సర్వే ప్రకారం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో రెండు వర్గాలుగా ఉన్న వారిపై కూడా జగన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.