NewsTelangana

న్యాయవాది దారుణహత్యతో ఓరుగల్లులో టెన్షన్ టెన్షన్

Share with

ఈ మధ్యకాలంలో భూవివాదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఎంతలా అంటే భూవివాదాల కారణంగా ప్రత్యర్ధులు ఎంతటి అఘాయిత్యాలకైనా పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో హనుమకొండకు చెందిన న్యాయవాది మాలగుండ్ల మల్లారెడ్డి ఇలాంటి దారుణానికి బలయ్యారు. భూ సమస్యపై మాట్లాడటానికి కలెక్టర్ కార్యాలయానికి  వచ్చిన ఆయన దారుణహత్యకు గురయ్యారు. అక్కడ నుండి తిరిగి వెళుతుండగా గుర్తుతెలియని దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.ఈ సంఘటన జరిగిన సమయంలో ఘటనా స్థలంలో ఉన్న మల్లారెడ్డి కార్ డ్రైవర్ సారంగం దీని గురించి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసులు అందించిన వివరాల ప్రకారం… ములుగు మండలం పందికుంట బస్ స్టాప్ సమీపంలో స్పీడు బ్రేకర్ల వద్ద మల్లారెడ్డి వాహనాన్ని వెనుక మరో కారులో వస్తున్న నిందితులు ఢీకొట్టారు. దీంతో మల్లారెడ్డి కారు దిగి ఎందుకు కారును ఢీకొట్టారని వారిని ప్రశ్నించగా… అందులోని ఒక వ్యక్తి వచ్చి క్షమించాలని కోరాడు. దాంతో శాంతించిన న్యాయవాది తిరిగి తన కారు వద్దకు వెళ్ళి డోర్ వేసుకుంటుడగా మరో నలుగురు ఆయన వద్దకు వచ్చారు. వారిలో ముగ్గురు న్యాయవాదిని కారులో నుంచి కిందకు లాగి సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి విచక్షణా రహితంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ సమయంలో అక్కడే ఉన్న కార్ డ్రైవర్‌ను మరో ఇద్దరు వ్యక్తులు కదలకుండా పట్టుకున్నారు. ఘటానానంతరం అక్కడ ఉన్న ఐదుగురు నిందితులు అదే కారులో పరారయ్యారు.

ఈ ఘటనా స్థలాన్ని ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్,ఏఎస్పీ సుధీర్‌ రాంనాథ్ కేకన్, ఇతర పోలీసు అధికారులు పరిశీలించామన్నారు. అయితే ఈ హత్యకు సంబంధించి అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ములుగు ఎస్సై ఓంకార్ యాదవ్ తెలిపారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇటీవల భూసమస్యల నేపథ్యంలో మల్లారెడ్డి  తరచూ ములుగు కలెక్టర్,తహసీల్దారు కార్యాలయాల చుట్టు తిరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే మల్లారెడ్డి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న శత్రవులు మాటు వేసి ఆయనను హతమార్చారు. మల్లారెడ్డికి ములుగు మండలం మల్లంపల్లిలో వ్యవసాయ భూములతో పాటు ఎర్రమట్టి క్వారీ, పెట్రోలు బంకు వ్యాపారాలున్నాయి. అయితే ఈ భూములకు సంబంధించిన అనేక కేసులు కోర్టుల్లో విచారణలో ఉన్నాయ్. మల్లారెడ్డి కుటుంబ విషయానికి వస్తే ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన స్వస్థలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కాగా.. చాలా కాలం నుంచి హనుమకొండలో నివాసం ఉంటున్నారని పోలీసులు వివరించారు. ఈ హత్యను ములుగు ఎమ్మెల్యే సీతక్క తీవ్రంగా ఖండించారు. అంతే కాకుండా మల్లారెడ్డి హత్యను వరంగల్ బార్ అసోసియేషన్ ఖండించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేడు విధుల బహిష్కరణ చేశారు. ఈ హత్యకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఉమ్మడి జిల్లాలోని బార్ అసోసియేషన్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి.