చైనా మహిళ కంటి నుండి పదుల సంఖ్యలో పురుగులు
ఈ మధ్యకాలంలో వైద్యులు సైతం నివ్వెరపోయేలా వింత వింత ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఒక చైనా మహిళ ఈ మధ్య భరించలేని కళ్ల దురదతో బాధ పడుతూ ఉందట. కొంతకాలం అలక్ష్యం చేసిన ఆమె, ఒక రోజు గట్టిగా కళ్లు నలుపుకోగానే ఒక పురుగు రాలి పడడం గమనించింది. దీనితో బెంబేలెత్తి వైద్యులను సంప్రదించగా, ఆమె కళ్లు పరీక్ష చేసిన వారికి కనురెప్పలు, కనుబొమ్మల మధ్య అనేక పురుగులు కనిపించాయి. దీనితో వాటిని తక్షణమే తొలగించే ప్రక్రియ మొదలు పెట్టారు. ఆమె కుడి కన్ను నుండి 40, ఎడమ కంటి నుండి 20 కి పైగా సజీవమైన పురుగులను వెలికి తీశారు. వాటిని పరీక్షించగా, అవి కుక్కలు, పిల్లులు శరీరాలపై నివాసం ఉండే లార్వాలని తెలిసింది. పెంపుడు జంతువులను ముద్దు చేయడంలో వాటి శరీరాలను ఆశ్రయించి ఉండే లార్వాలు ఆమె కంటిలో ప్రవేశించాయని తేల్చారు. అలాగే ఇంకా లార్వాలు మిగిలాయా అనేది, తరచూ పరీక్షలు చేయించుకోవాలని ఆమెను సూచించారు. జంతువులకు దూరంగా ఉండాలని సూచించారు.

