సంక్రాంతి వేడుకలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధం
◆నేడు భోగ భాగ్యాల భోగి పండుగ
◆రేపు మకర సంక్రాంతి….ఎల్లుండి కనుమ
సంక్రాంతి వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. సంప్రదాయ వేడుకను ఘనంగా జరుపుకోవడానికి ప్రజలు సిద్ధం అయ్యారు. ఈరోజు శనివారం భోగి, ఆదివారం సంక్రాంతి, సోమవారం కనుమ పండుగ జరుపుకోనున్నారు. సంక్రాంతి అంటేనే భోగి మంటలు రంగు రంగుల ముగ్గులు.. అందమైన రంగవల్లులు రతనాల గొబ్బిళ్లు పిండి వంటలు కోడి పందేలు గాల్లో పతంగులు కొత్త అల్లుళ్ల సందడితో సంక్రాంతి పండుగ అందరి ఇంటా సంబరాలను తీసుకొస్తుంది. అందుకే ఈ పండుగ సమయంలో అన్ని లోగిళ్లలో సంతోషం నిండుతుంది. మరోవైపు పంట చేతికి వచ్చే సమయంలో వచ్చే ఈ పండగొచ్చొందంటే చాలు బసవన్న చిందులు, హరిదాసుల సంకీర్తనలు, గాలిపటాలు., బావమరదళ్ల సరసాలతో సంక్రాంతి పండుగ ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంటుంది.

మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి. ఈ సమయంలో భగభగ మండే మంటల్లో పాత వస్తువులను, గోవు పిడకలను వేయడంతో ఈ పండుగ ప్రారంభమవుతుంది. ఇదేరోజున చిన్నారులపై భోగి పళ్లను పోస్తారు. పురాణాల ప్రకారం ఈరోజున బదరీవనంలో శ్రీమహా విష్ణువును పసిబాలుడిగా మార్చి దేవతలు బదరీ పండ్లు(రేగి పళ్లు)తో అభిషేకం చేశారు. ఈ భోగి పళ్లే కాలక్రమంలో రేగీ పళ్లుగా రూపాంతరం చెందాయి. ఈరోజు చిన్నపిల్లలకు పూలు, రేగి పళ్లు, కలిపి భోగిపళ్లుగా పోయడం వల్ల వారు ఏడాదంతా ఆయురారోగ్యాలతో ఉంటారని చాలా మంది నమ్మకం. రెండో రోజు అంటే మకర సంక్రాంతి సమయంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఆదివారం సంక్రాంతి పర్వదినాన సూర్యభగవానుడు దక్షిణయానం నుంచి ఉత్తరయాణలోకి రావడం వల్ల పుణ్యకాలం ప్రారంభమవుతుంది.

ఇక మూడో రోజు సోమవారం కనుమ పండుగ. ఈ సమయంలో పశువులను అలంకరించి పూజిస్తారు. ఈ పండుగ సందర్భంగా నాలుగో రోజున ముక్కనుమగా వ్యవహరిస్తారు. ఈరోజున కొన్ని ఊళ్లలో కొత్తగా వివాహం చేసుకున్న యువతులు తమ సౌభాగ్యం కోసం బొమ్మల నోము, సావిత్రి గౌరీ వ్రతం చేస్తారు. సంక్రాంతి రోజున పిత్రు దేవతల ఆత్మ శాంతి కోసం ప్రార్థనలు చేస్తారు. సంక్రాంతి అంటేనే పిండి వంటలకు ప్రత్యేకం. ఈ పండుగ సమయంలో చేసే వంటకాలు ప్రతి ఒక్కరినీ నోరూరిస్తాయి. ఇలాంటి పిండి వంటలు ఏ పండగకూ చేయరంటే అతిశయోక్తి కాదేమో. చాలా మందికి వాటి నుంచి వచ్చే సువాసనకే కడుపు నిండిపోతూ ఉంటుంది. ఎందుకంటే సకినాలు, సున్నుండలు, అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, పూతరేకులు, బూరెలు, గారెలు, ఇలా జాబితా చెప్పుకుంటూ పోతే పెరుగుతుందే తప్ప తగ్గదు. ఈ పండుగ సందర్భంగా ఎవరికిష్టమొచ్చిన వంటలు వారు వండుకుంటూ.. వాటిని చుట్టుపక్కల వారికి కూడా పంచుతూ సంక్రాంతి సంతోషాన్ని అందరితో పంచుకుంటారు.

సంక్రాంతి సమయంలో కొత్త అల్లుడు ఇంటికి వస్తున్నాడంటే.. ఆ హడావుడే వేరు. మరదళ్ల సరసాలు.. బావమరదళ్లను ఆటపట్టించడాలు అబ్బో ఆ ఆనందమే వేరు. ఈ పండక్కి అల్లుళ్ల అలక.. అత్త,మామల బుజ్జగింపులతో సంక్రాంతి అంతా సందడిగా ఉంటుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి సమయంలో ఉదయం మరియు సాయంత్రం వేళలో గాలిపటాలను ఎగురవేస్తారు. ఈ సమయంలో పెద్దవారు కూడా పిల్లలైపోతారు. ఇటీవల బసవన్నల సందడి పెద్దగా కనిపించడం లేదు. అదేవిధంగా హరిదాసుల కీర్తనలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి. సంక్రాంతి సమయంలో కోడి పందేలు, ఎడ్ల పందేలతో అందరిలో ఉత్సాహం ఓ రేంజ్ ను దాటుతుంది. ఈ సంక్రాంతి సమయంలో పండుగ అంతా పల్లెటూళ్లలోనే కనబడుతుంది. ఉద్యోగులు, కూలీ పని చేసుకునే వాళ్లు, వలస వెళ్లిన వారంతా పట్నం వదలి పల్లెటూళ్ల బాట పడతారు. సంక్రాంతి తమ కుటుంబంతో సరదాగా గడిపేందుకు స్వస్థలాలకు చేరుకుంటారు. వీరి రాకతో పల్లెలు మరింత శోభతో వెలిగిపోతాయి. వెళ్తూ వెళ్తూ ఏడాదికి సరిపోయే ఆనందాన్ని తీసుకెళ్తారు. అందుకే సంక్రాంతిని ఆనందాల క్రాంతి అంటారు.

