InternationalNews

ఫ్రాన్స్‌లో తెలుగు సాహిత్య సాంస్కృతిక సదస్సు

తేనె కంటే తియ్యదైనది తెలుగు భాష. ప్రపంచంలోనే అందమైనది తెలుగు లిపి. ఇంతటి ఘనత కలిగిన తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక సదస్సు ఫ్రాన్స్‌లో జరగనుంది. వచ్చే ఏడాది జూన్‌ 22, 23, 24 తేదీల్లో జరిగే ఈ సదస్సులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది తెలుగు భాషాభిమానులు, రచయితలు, ప్రజాప్రతినిధులతో పాటు కళాకారులు పాల్గొంటారు. ఇందులో పద్య నాటకాలు, బుర్రకథలు, హరికథలు, జానపద కళలను కూడా ప్రదర్శిస్తారు. తెలుగు పుస్తకాలు, తాళపత్రాలతో ఓ ఎగ్జిబిషన్‌ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ సదస్సు నిర్వహణకు తెలుగు రాష్ట్రాల సాయం కోరేందుకు ఫ్రాన్స్‌లో నివసించే తెలుగు భాషాభిమాని డానియెల్‌ నేజెర్స్‌.. హైదరాబాద్‌ వచ్చారు.

2020లోనే నిర్వహించాలనుకున్నాం

ప్యారిస్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ లాంగ్వేజెస్‌ అండ్‌ సివిలైజేషన్‌ విశ్వవిద్యాలయంలో సౌత్‌ ఆసియా, హిమాలయన్‌ స్టడీస్‌లో తెలుగు విభాగాధిపతిగా డానియెల్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ తెలుగు సదస్సును 2020లోనే నిర్వహించాలనుకున్నామని, కరోనా వల్ల సాధ్యం కాలేదని ఆయన చెప్పారు. సదస్సు నిర్వహణకు సహకరించాలని కోరుతూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాస్తానన్నారు. మళ్లీ నవంబరులో వచ్చి అందరినీ కలుస్తానని చెప్పారు. గత ఏడాది నవంబరులో మంత్రి కేటీఆర్‌ ప్యారిస్‌ వచ్చారని, అప్పుడు ఆయనను కలిసి సదస్సు నిర్వహణపై చర్చించామని తెలిపారు. యునెస్కో సహకారం కూడా తీసుకుంటామని పేర్కొన్నారు.