UNOలో భారత రాయబారిగా తెలుగు తేజం
ఐక్యరాజ్యసమితిలో భారత ప్రధాన రాయబారిగా ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వతనేని హరీశ్ నియమితులయ్యారు. ఆయన తెలుగువారు కావడం విశేషం. ఆయన స్వస్థలం విశాఖపట్నం. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి మెకానికల్ ఇంజినీరింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. అనంతరం కోల్‌కత్తాలోని ఐఐఎంలో మేనేజ్‌మెంట్ పూర్తి చేశారు. 1990లో ఐఎఫ్‌ఎస్‌కు ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారిగా ఉన్నారు. అంతకు ముందు విదేశాంగ శాఖలో ఆర్థిక సంబధాలు అదనపు కార్యదర్శిగా పనిచేశారు. ఆయన జీ20,జీ 7, బ్రిక్స్, ఐబీఎస్‌ఏ దేశాలతో దౌత్యసంబంధాలు నెరపడంలో కీలక పాత్ర పోషించారు. ఆ పదవిలో పనిచేస్తున్న రుచిర కాంభోజ్ ఈ సంవత్సరం జూన్‌లో పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో హరీశ్‌ను నియమించారు. గతంలో ఈ పదవిలో ప్రస్తుత కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలు కూడా పని చేశారు.

