గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసం
• ఆర్పీఎఫ్ ఆధీనంలో గన్నవరం నియోజకవర్గం
• ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
• పార్టీ రెబల్ ఎమ్మెల్యే వంశీ, టీడీపీ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లు
ఏపీలోని కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అధికార విపక్ష పార్టీల నేతల సవాళ్లు చిచ్చు రగిలించాయి. గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతూ ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్యే వంశీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేషులపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. అంతేకాకుండా ఒక అడుగు ముందుకు వేసి తనపై పోటీకి దిగాలని వారికి వంశీ సవాల్ విసిరారు. గన్నవరం వస్తే తానేంటో చూపిస్తానని వంశీ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు సీరియస్ గా స్పందించి వరుస ప్రెస్ మీట్ లు నిర్వహిస్తూ వంశీ పై విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేత చిన్నపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. దీంతో ఈ వివాదం మరింత పెద్దదిగా మారింది. సోమవారం ఈ ఘటనపై ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నేతలు స్థానిక పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే వంశీ అనుచరులు ఒక్కసారిగా వీరంగం సృష్టించారు.
సాయంత్రం 4:00 సమయంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై 60 మందికి పైగా కార్యకర్తలు దాడికి పాల్పడి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. అలాగే అక్కడే నిలిపి ఉన్న ఒక కారును తగలపెట్టారు. మరో మూడు కార్లను ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. వైసీపీ శ్రేణులను ఎమ్మెల్యే వంశీ అనుచరులను అడ్డుకునేందుకు పోలీస్ బలగాలు ప్రయత్నించాయి. మంటలను ఆర్పేందుకు వచ్చిన ఫైర్ ఇంజన్‌ను సైతం అధికార పార్టీ శ్రేణులు అడ్డు కావడంతో వాహనం పూర్తిగా కాలి బూడిదయ్యింది. ఈ దాడులను నియంత్రించేందుకు పోలీసులు కొంత మేరకు ప్రయత్నించిన పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. క్రికెట్ బ్యాట్లు పెట్రోల్ క్యాన్ లతో దాడులు కొనసాగాయి. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే వంశీతోపాటు వైసీపీ శ్రేణులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు జాతీయ రహదారిపై బైఠాయించాయి. ఈ ఘటన తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత పట్టాభి స్థానిక నేతలతో కలిసి ఫిర్యాదు చేసేందుకు గన్నవరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వస్తుండగా మరోసారి వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు.

పట్టాభి వాహనాన్ని ధ్వంసం చేశారు. అయితే పట్టాభి అక్కడ నుంచి ఏదో విధంగా తప్పించుకొని బయటపడ్డారు. ఈ ఘటన సమాచారం అందుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున గన్నవరం చేరుకున్నారు. దీంతో వాతావరణం హై టెన్షన్‌గా మారింది. పోలీసులు అదనపు బలగాలను రప్పించడంతోపాటు అరెస్టులు పర్వానికి తెరదీశారు. ఇదే సమయంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో చిన్న అనే తెలుగుదేశం పార్టీ నేత కారును వంశి అనుచరులు తగులబెట్టారు. ఈ ఘటన మళ్లీ చిచ్చును మరింత రగిల్చింది. ఈ నేపథ్యంలో గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడిలో పార్టీ కార్యాలయం ధ్వంసం ఘటనపై డిజిపి రాజేంద్రనాథరెడ్డికి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఈ లేఖలో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ గుండాలకు పోలీసులు పూర్తి స్వేచ్ఛని ఇచ్చినట్లుగా కనిపిస్తోందని విమర్శించారు. వైసీపీ నేతలు, శ్రేణులు దాడులకు పాల్పడుతుంటే పోలీసులు మౌనంగా చూస్తున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతల పరిరక్షణకు దోషులను అరెస్టు చేయాలని వారిని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

