విజయమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీల అడుగులు
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడిగా అడుగులు వేస్తున్నాయి. ఇంకా ఎన్నికలకు ఐదు నెలలు సమయం ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి ప్రణాళికలతో జనంలోకి వెళ్లేందుకు సన్నాహాలు మొదలుపెట్టాయి. సమయాన్ని వృధా చేయకుండా రెండు పార్టీల నేతలు శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి పర్యటనకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సమన్వయ కమిటీ రాష్ట్ర జిల్లా స్థాయి భేటీలు కొలిక్కి రావటంతో ఇక క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య నేతలు కార్యకర్తలు ఉండేలా ప్రణాళికలు చేస్తున్నారు.

ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉమ్మడిగా రోడ్డుమ్యాప్ ను కూడా సిద్ధం చేశాయి. 45 రోజులపాటు పూర్తి స్థాయిలో ఇంటింటికి తెలుగుదేశం ప్రకటించిన కార్యక్రమాన్ని ఉమ్మడిగా నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే భవిష్యత్‌కు గ్యారెంటీ పేరిట తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలకు జనసేన ఆమోదముద్ర వేసింది. వీటికి అదనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో నాలుగు వర్గాలకు సంబంధించిన హామీలను దానిలో చేర్చేందుకు ప్రతిపాదించారు. భవన నిర్మాణరంగ కార్మికులు, యువత, రైతులు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్‌కు సంబంధించిన అంశాలను మ్యానిఫెస్టోలో జోడించాలని స్పష్టం చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఆరు పథకాలకు అదనంగా ఈ నాలుగు పథకాలు కలిపి మొత్తం పది హామీలను ప్రజల ముందు ఉంచనున్నారు. నవంబర్ ఒకటో తేదీ రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రకటించనున్నాయి.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి హామీలతో ఇంటింటి ప్రచారానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఐదు నెలల పాటు ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించి తెలుగుదేశం జనసేన పార్టీల తరఫున ప్రజలకు స్పష్టమైన హామీలను ఇవ్వనున్నారు. మొత్తం పది హామీలను ప్రజలకు ఇవ్వటమే కాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున భవిష్యత్తుకు గ్యారెంటీ హామీలకు సంబంధించి చంద్రబాబు సంతకంతో కూడిన హామీ పత్రాన్ని కూడా అందజేయనున్నారు. నవంబరు ఒకటో తేదీన మినీ మేనిఫెస్టోను విడుదల చేసి ఆ రోజు నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని రెండు పార్టీలు పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం జనసేనకు సంబంధించిన ఉమ్మడి పూర్తి మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చినా అనంతరమే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం 10 నిర్దిష్టమైన హామీలతో అప్పటివరకు ప్రచారం నిర్వహించి అనంతరం ఇంటింటి ప్రచారంలో వచ్చిన ప్రజా సమస్యలు ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని వాటికి అనుగుణంగా పూర్తిస్థాయి మేనిఫెస్టోను రూపొందించనున్నారు. చంద్రబాబు సూచనలు సలహాలు మేరకు తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికే కొన్ని అంశాలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా రైతాంగం యువత మహిళలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించేలా పూర్తి మేనిఫెస్టో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా రైతులకు రుణమాఫీ చేసే అంశంపై రెండు పార్టీలు తుది నిర్ణయం తీసుకొని మేనిఫెస్టోలో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశంపై చంద్రబాబు నాయుడు కొంత కసరత్తు చేశారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా రైతులతో అనేకమార్లు సమావేశమై వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రైతు రుణమాఫీ అంశం ఉమ్మడి మేనిఫెస్టోలో తప్పనిసరిగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. నవంబరు ఒకటి నుంచి పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉండి విజయమే లక్ష్యంగా ఇరు పార్టీలు అడుగులు వేయనున్నాయి.

