NewsTelangana

సెప్టెంబరు 17న తెలంగాణ సమైక్యతా దినం..

హైదరాబాద్‌: ఈ నెల 16, 17, 18 తేదీల్లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని, సెప్టెంబర్‌ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం ప్రగతి భవన్‌ లో 3 గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించడంతో పాటు ఈ నెల 6 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల ఎజెండాను రూపొందించారు. గత మార్చి 15న ముగిసిన అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. వాటికి కొనసాగింపుగానే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయించింది. గత సమావేశాలు వాయిదా పడ్డాయే తప్ప.. ప్రొరోగ్‌ కాలేదు. స్పీకర్‌ ఎలాంటి ప్రతిపాదన చేయకపోవడంతో సమావేశాలను గవర్నర్‌ ప్రొరోగ్‌ చేయలేదు. గత బడ్జెట్‌ సమావేశాలు గవర్నర్‌ ప్రసంగం లేకుండానే మొదలైన అంశం నాడు తీవ్ర చర్చకు దారితీసింది. అయితే 6 నెలల్లోగా అసెంబ్లీని సమావేశ పర్చాల్సి ఉండటంతో ఈ నెల 6 నుంచి సమావేశాలు ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది.

ఏడాది పాటు వజ్రోత్సవాలు
సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తోంది. తాజాగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తో పాటు ఇతర నేతలు ఈ డిమాండ్‌ ను లేవనెత్తారు. ఈ దశలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చింది. ఏడాది పాటు రాష్ట్రంలో వజ్రోత్సవాలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్‌ సంస్థానం విలీనమై 74 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రివర్గ సభ్యులు చర్చించారు. ప్రభుత్వ బిల్లులపై కూడా చర్చ జరిగింది. విద్యుత్‌ బకాయిల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వైఖరి అనుసరించాలనే విషయాలపైనా చర్చించారు. సీబీఐని రాష్ట్రంలోకి అనుమతించరాదన్న అంశంపైనా చర్చ జరిగినట్లు తెలిసింది.

• తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ప్రారంభంలో భాగంగా మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించారు. 16న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్‌థులు, యువతీ, యువకులు, మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

• సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రసంగిస్తారు. అదే రోజు జిల్లా కేంద్రాల్లో మంత్రులు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించి, కార్యక్రమాలు నిర్వహిస్తారు.

• సెప్టెంబర్‌ 17న మధ్యాహ్నం బంజారా ఆదివాసీ భవన్‌ల ప్రారంభోత్సవం ఉంటుంది. ఈ సందర్భంగా నెక్లెస్‌ రోడ్డు నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ఎన్టీఆర్‌ స్టేడియం వరకు భారీ ప్రదర్శన నిర్వహించి, అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభకు సీఎం కేసీఆర్‌ చీఫ్‌ గెస్ట్‌ గా పాల్గొని ప్రసంగిస్తారు.

• సెప్టెంబర్‌ 18న జిల్లా కేంద్రాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానాలు, కవులు, కళాకారులకు సత్కారాలు ఉంటాయి. తెలంగాణ స్ఫూర్తిని చాటేలా కల్చరల్‌ కార్యక్రమాలు నిర్వహించాలి.