NewsTelangana

దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచి

Share with

తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని, దేశానికే రాష్ట్రం దిక్సూచిగా మారిందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం సీఎం ప్రసంగించారు.

మహనీయుల త్యాగాల వల్లే స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నామన్నామని, వారి పోరాటాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. గొర్రెల  పెంపకంలో దేశంలో నంబర్‌ వన్‌గా నిలిచామని, గ్రామీణ జీవన విధానంలో అగ్రస్థానంలో నిలిచామని తెలిపారు. దేశ నిర్మాణంలో తెలంగాణ బలమైన భాగస్వామిగా నిలిచిందని సీఎం అన్నారు.  అణగారిన దళిత జాతి సమగ్ర అభ్యున్నత ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన దళిత బంధు పథకాన్ని అమల్లోకి తెచ్చిందని తెలిపారు.

మరోవైపు.. సీఎం కేసీఆర్‌ కేంద్రంపై మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు కేంద్రం తెరలేపిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తున్నది. కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయం మొత్తంలోంచి న్యాయబద్ధంగా 41 శాతం వాటా రాష్ట్రాలకు చెల్లించాలని కేసీఆర్‌ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రూపాయి విలువ నానాటికి తీసికట్టు నాగంభొట్లు అన్న తీరుగా ఎన్నడూ లేనంతగా పడిపోయిందన్నారు సీఎం కేసీఆర్‌. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తూ నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నారని సీఎం తీవ్రంగా ధ్వజమెత్తారు.   గోల్కొండ కోటకు చేరుకునే ముందు ప్రగతిభవన్‌లో జాతీయ జెండా ఎగురవేసి, సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు కేసీఆర్‌ చేరుకున్నారు. అమర జవానుల స్మృతి చిహ్నం వద్ద కేసీఆర్‌ నివాళులర్పించారు. అమర వీరుల త్యాగాలను కేసీఆర్‌ స్మరించుకున్నారు.