తిరుమలలో పోటెత్తిన భక్తులు..
వరుస సెలవులు రావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల గిరి కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. వివిధ రాష్ట్రాల నుండి భక్తులు తరలి రావడంతో తిరుమలలో రద్దీ భారీగా పెరిగిపోయింది. భక్తుల సంఖ్య పెరగడంతో సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనంలో మాత్రమే భక్తులను దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటలకుపైగా సమయం పడుతుండగా.. సర్వదర్శనానికి 36 గంటలకు పైగా సమయం పడుతోందని అంచనా. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, పాలు, నీళ్లు, అల్పాహారం అందిస్తున్నారు. తిరుపతిలో వసతి ఉన్న భక్తులే తిరుమల దర్శనానికి రావాలని అధికారులు సూచిస్తున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.27 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.