వామ్మో ఆర్టీసీ… ఇక లాగేజీ తీసుకెళ్లాలంటే దబిడిదిబిడే…
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ లగేజీ ఛార్జీలు భారీగా పెరిగాయి. బస్సుల్లో తరలించే సామాగ్రిపై విధించే చార్జీలను భారీఎత్తున పెంచేసింది. పల్లె వెలుగు బస్సుల్లో 25 కీ.మీ దూరానికి ఇప్పటివరకు ఉన్న రూపాయి చార్జీని ఏకంగా రూ.20కి పెంచింది. ఎక్స్ ప్రెస్ ఆపై కేటగిరీ బస్సుల్లో ఇదే దూరనికి ఉన్న రూ.2 చార్జీని రూ.50కి పెంచింది. ఈ లగేజీ ఛార్జీలను భారీగా పెంచుతూ తెలంగాణ ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన కొత్త ఛార్జీలు శుక్రవారం… ఎల్లుండి నుంచే అమలులోకి వస్తాయని ఆ ఉత్తర్వులో పేర్కొంది.
లగేజీ ఛార్జీలు సుదీర్ఘకాలంగా ఒకేలా ఉన్న అంశంపై ఇటీవల జరిగిన టాస్క్‌ఫోర్స్ సమావేశంలో చర్చ జరిగింది. ఈ క్రమంలో ఛార్జీలను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. 2002 తర్వాత పలుమార్లు టికెట్ చార్జీలు పెరిగినా లగేజీ ఛార్జీలను పెంచిన మాత్రం సవరించలేదు. డీజిల్ ధరలతోపాటు మానవ వనరుల వ్యయాలు పెరిగాయి. అందుకే లగేజీ ఛార్జీలను పెంచక తప్పటం లేదు. ఆర్టీసీ కార్గో సేవలను ప్రోత్సహించేందుకు ఆ ఛార్జీలతోపాటు వీటిని సమానంగా పెంచినట్టు అధికారులు చెబుతున్నారు. గరిష్ట లగేజీ పల్లెవెలుగు, ఎ క్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకు750 కిలోలుసూపర్ లగ్జరీ బస్సులకు 1,000 కిలోలు గా పరిమితి విధించారు.
ప్రయాణికుడు ఉచితంగా తీసుకెళ్లే 50 కిలోల బరువు కూడా మూడు బాగేజీలకు మించరాదంటూ కొత్త నిబంధన విధించారు. బ్యాగులు, సూట్‌కేసులు వగైరా ఎవైనా కూడా మూడు మాత్రమే ఉండాలంటున్నారు. 100 కిలోలకు మించి బరువు ఉంటే ప్రయాణికుల బస్సుల్లో అనుమతించరు. కార్గో బస్సుల్లోనే తరలించాలని స్పష్టం చేస్తున్నారు. ఇకపై టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ట్రక్కు టైర్లు తరలించాలంటే యూనిట్లుగా పరిగణించి ఛార్జీలు వసూలు చేస్తారు. టీవీ, ఫ్రిజ్, సైకిల్, ఫిలిం బాక్సులు, వాషింగ్ మెషీన్, కార్ టైర్లను రెండు యూనిట్లుగా, రేడియో, ఖాళీ బ్యాటరీ, టేబుల్ ఫ్యాన్, 25 లీటర్ల ఖాళీక్యాన్, కంప్యూటర్ మానిటర్, సీపీయూ,
హార్మోనియంలను ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. చాలాచోట్ల కూరగాయలు, పాలు, పండ్లను ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తున్నారు. ఇప్పుడు అలాంటి రైతులు
భారీగా చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.