పదోతరగతి పరీక్షలపై తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణాలో పదోతరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పదోతరగతి పరీక్షలను 6 పేపర్లతో నిర్వహించాలని విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయితే ఈ రోజు తెలంగాణా ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. తెలంగాణాలో ఇప్పటి వరకు 11 పేపర్లతో పదోతరగతి పరీక్షలు జరుగుతూ వచ్చాయి. వీటిల్లో హిందీ మినహా ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లు ఉంటాయి. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా 6 పేపర్ల విధానాన్ని అమలు చేశారు. తాజాగా పదోతరగతి పరీక్షల విధానంపై ఎన్సీఆర్టీ సమీక్ష నిర్వహించింది. దీనిలో 11 రోజులు పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఒత్తిడికి గురి అవుతున్నారని గుర్తించింది. కాగా ఈ 11 పేపర్లను 6కు కుదించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనికి స్పందించిన ప్రభుత్వం పదోతరగతి పరీక్ష విధి విధానాలను సవరించాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. తెలంగాణాలో నవంబర్ 1 నుంచి ఎస్ఏ-1 పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను 10 వ తరగతి విద్యార్థులకు 6 పేపర్లతోనే నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. దీని ప్రకారమే షెడ్యూల్‌ను కూడా రూపొందించినట్లు తెలుస్తోంది.

