తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టికి యాదాద్రి ఆలయంలో ఘోర అవమానం
కాంగ్రెస్ నేతల మటలకు, చేతలకు అర్థాలే వేరులే అన్నట్టుగా తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. గతంలో సీఎం కేసీఆర్ విషయంలో చాలా మంది ఏదైతే అసహనానికి గురయ్యారో ఇప్పుడు కూడా అదే స్టైల్ లో పాలన సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకులు ఏం చేసినా దానికి అర్థం, పరమార్థం ఉంటుంది. అందుకే వారు ఏం చేయాలన్నా, ఏం చేసినా… ఆచితూచి వివరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సమాజంలో అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ నాయకులు కొన్నిసార్లు ఆ అస్త్రానికి తామే బలవుతుంటారు.

ఏదైనా అనుకొని చేయాలనుకోకున్నా… కాకతాళీయంగానైనా, సరే సమాజంలోని అట్టడుగు వర్గాలను అవమానకరంగా వ్యవహరిస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. తాజాగా యాదాద్రి పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విషయంలో ఇదే జరిగింది. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి ఆయన సతీమణి, వారికి ఇంకోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పీటలపై కూర్చొండగా… మరోపక్కన మల్లు భట్టి విక్రమార్క నేల మీద కూర్చున్నట్లుగా ఫోటోలు విడుదలయ్యాయి. వాస్తవానికి ప్రభుత్వంలో నెంబర్ 2 పొజిషన్‌లో ఉన్న మల్లు భట్టి విక్రమార్క.. నేలపై కూర్చోవడమేంటని అందరు చెవులు కొరుక్కున్నారు. నాడు విపక్షంలో ఉన్న సమయంలో ఆయన సీఎల్పీ లీడర్ గా వ్యవహరించారు.

అంతటి ఘన చరిత్ర ఉన్న మల్లు భట్టి విక్రమార్కను నేలపై కూర్చోబెట్టడంపై ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయ్. దళితలంటే కాంగ్రెస్ పార్టీకి చులకనంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, మందకృష్ణ మాదిగను గుండెల్లో పెట్టుకొని ఎస్సీ వర్గీకరణకు జై కొడితే, కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం అని చెబుతూ.. ఉపముఖ్యమంత్రిని, నేలపై కూర్చోబెడుతుందా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. కాంగ్రెస్ పార్టీ నైజం బయటపడిందని విమర్శలు గుప్పేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం ఇలాగే ఉంటుందా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

