పలు బీసీ కులాలను, ఎస్టీ జాబితాలో చేర్చాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం
రాష్ట్రంలోని పలు బీసీ కులాలను షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్ని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. వాల్మీకి బోయలు, పెద్ద బోయలు, ఖైతీ లంబాడాలు, మాలి సహ బీదర్, కిరాతక, నిషాది, భట్ మధుర, చమర్ మధుర, చుండువాలు, తలయారి కులాలను ఎస్టీల జాబితాలో చేర్చాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీర్మానం ప్రవేశపెట్టారు. బీసీ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న ఎస్టీ కమిషన్ సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి 2016లో కేంద్రానికి ప్రతిపాదన పంపినా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ముఖ్యమంత్రి సభకు తెలిపారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఎక్కువగా నివాసముంటున్న మాలి కులస్తులు తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారన్నారు. వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం వారిని కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానం చేస్తోందన్నారు. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారంటూ అభినందించారు వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వీఏ అబ్రహం, దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కులసంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.


