అధ్యాపకురాలి ఆత్మహత్య
చెన్నూరు: తాను పాఠాలు బోధించే గురుకులంలోనే ఓ అధ్యాపకురాలు వేధింపులకు గురయ్యారు. వాటిని భరించలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో సోమవారం జరిగిందీ దారుణం. చెన్నూరు పట్టణ సీఐ వాసుదేవరావు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన తిరుమలేశ్వరి (39) చెన్నూరులోని ఆదర్శనగర్‌లో నివాసముంటున్నారు. చెన్నూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నాలుగేళ్లుగా జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రిన్సిపల్ ఆమెకు మెస్ కేర్‌టేకర్‌గా అదనపు బాధ్యతలిచ్చారు. వాటితో పనిఒత్తిడి అధికమైందని, మెస్‌కు సంబంధించిన అంశాల్లో ప్రిన్సిపల్ రాజమణితో సహా కొందరు టీచర్లు వేధిస్తున్నారంటూ ఆమె భర్త సంపత్‌తో చెబుతూ వస్తున్నారు.
వదిలి వెళ్లిన 2 గంటల్లోనే..: ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 6 గంటల సమయంలో తిరుమలేశ్వరి భర్త గురుకులం వద్ద దింపి వెళ్లాడు. రెండు గంటల తర్వాత భార్యకు ఫోన్ చేశాడు. ఇతరులు ఫోన్‌లో మాట్లాడి, పెద్దచెరువు ఒడ్డున బ్యాగు ఉందని చెప్పడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లాడు. చెరువులో భార్య అచేతనంగా పడి ఉండగా ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. భర్త ఫిర్యాదు మేరకు మృతురాలి ఫోన్‌ను పరిశీలించాం. అందులోని వాయిస్ రికార్డులో ప్రిన్సిపల్ రాజమణి, అసిస్టెంట్ కేర్ టేకర్ స్రవంతి, పీఈటీ రేష్మ, సహ టీచర్లు శిరీష, పుష్పలత వేధింపుల వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తిరుమలేశ్వరి పేర్కొంది అని సీఐ తెలిపారు. ఈ మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. మృతురాలికి పదకొండేళ్ల కుమార్తె ఉందని వెల్లడించారు.
విన్నవించినా విన్పించుకోలేదు.. మృతిరాలి భర్త: నిబంధనల ప్రకారం జూనియర్ లెక్చరర్లను మెస్ కేర్‌టేకర్‌గా నియమించకూడదని, అయినా బలవంతంగా తనపై బాధ్యతలు రుద్దారని తిరుమలేశ్వరి నాతో చెప్పింది. వేధింపులు భరించలేనంటూ పలుసార్లు కన్నీళ్లు పెట్టుకుంది. ఆదివారం సాయంత్రం నేను ఇదే విషయం ప్రిన్సిపల్‌తో మాట్లాడా. ఆ బాధ్యతల నుంచి తన భార్యను తప్పించాలని విన్నవించా. ప్రిన్సిపల్ దానికి నిరాకరించడంతో పాటు చెప్పిన పని చెయ్యాల్సిందేనని తేల్చి చెప్పారు అని మృతురాలి భర్త సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు.


 
							 
							