షాహీ ఈద్గా మసీదును సర్వే చేయండి.. కోర్టు ఆదేశం
శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా కేసు వివాదంలో మథుర కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలంలో సర్వే చేయాలని కోర్టు అమిన్‌కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జనవరి 20, 2023 తేదీలోగా సర్వే పూర్తి చేసి.. ఆ నివేదికను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. జనవరి 2వ తేదీ తర్వాత నుంచి ఈ సర్వేను చేపట్టాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు సూచించింది. హిందూ సేన అనే సంస్థకు చెందిన విష్ణు గుప్తా వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. యూపీలోని వారణాలసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు సర్వేను నిర్వహించిన తరహాలోనే…షాహీ ఈద్గా మసీదు సర్వేను కూడా చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను జనవరి 20న నిర్వహిస్తామని కోర్టు పేర్కొంది.