NationalNews

ఎన్వీ రమణకు సుప్రీం కోర్టు షాక్‌..!

మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. జస్టిస్‌ రమణ ఇచ్చిన ఓ కీలక ఉత్వర్వును ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ వెనక్కి తీసుకున్నారు. వివాదాస్పద తెలుగు అధికారి ప్రసన్న కుమార్‌ సూర్యదేవరను సుప్రీం కోర్టు శాశ్వత ఉద్యోగిగా జస్టిస్‌ ఎన్వీ రమణ నియమించారు. ఆయనను మీడియా కన్సల్టెంట్‌ ఓఎడ్డీగా నియమించి.. అదనపు రిజిస్ట్రార్‌ హోదా కూడా కల్పించారు. జస్టిస్‌ ఎన్వీ రమణ తన పదవీ కాలం ముగియడానికి కొద్ది రోజులు ముందు ఇచ్చిన ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్‌.. ప్రసన్న కుమార్‌ను తన మాతృ సంస్థ అయిన ప్రసార భారతికి తిరిగి పంపించారు.

ప్రసార భారతిలో తెలుగు అనువాదకుడిగా కెరీర్‌ ప్రారంభించిన ప్రసన్న కుమార్‌ తొలి నుంచీ వివాదాస్పదుడిగానే నిలిచారు. ఆయన డిప్యుటేషన్‌పై లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ కార్యాలయంలో ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీగా, రాజ్యసభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీ వద్ద కూడా పని చేశారు. 2015లో ఢిల్లీ శాసనసభ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆప్‌ సర్కారు చేసిన ఈ నియామకాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ నిలిపివేసి ప్రసన్న కుమార్‌ను తన మాతృ సంస్థ ఆకాశవాణికి బదిలీ చేశారు. ఆ బదిలీని నిలిపివేసిన ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రామ్‌ నివాస్‌ గోయెల్‌.. ప్రసన్న కుమార్‌ను కొంత కాలం కొనసాగించారు. 2021లో ఆయనను ప్రసార భారతి జాయింట్‌ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.