మునుగోడులో బీసీలకు చాన్స్ ఇవ్వండి
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడులో బీసీలకు డిమాండ్ పెరిగింది. త్వరలో జరిగే ఉప ఎన్నికలో బీజేపీ తరఫున రాజగోపాల్‌రెడ్డి బరిలోకి దిగడం ఖాయమైంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మాత్రం అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఈ రెండు పార్టీల తరఫున టికెట్ కోసం పెద్ద క్యూనే కనిపిస్తోంది. అయితే.. నియోజక వర్గంలో బీసీల జనాభా ఎక్కువగా ఉండటంతో రెండు పార్టీలూ బీసీ అభ్యర్థులను నిలబెట్టాలని ఆశిస్తున్నాయి. బలమైన అభ్యర్థి కోసం ఆయా పార్టీలు అంతర్గత సర్వేలో తలమునకలయ్యాయి.
టీఆర్‌ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డితో పాటు బీసీ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, నారబోయిన రవి ముదిరాజ్, కర్నాటి విద్యాసాగర్ టికెట్లు ఆశిస్తున్నారు.
కాంగ్రెస్ తరఫున పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డితో పాటు బీసీ నేతలు పున్నా కైలాస్, పల్లె రవికుమార్‌గౌడ్, చెరుకు సుధాకర్‌గౌడ్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అభ్యర్థిని ఎవరు ముందు ప్రకటిస్తారనే విషయంపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని ప్రకటిస్తే.. తామూ అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ప్రకటించాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. టీఆర్‌ఎస్ ముందుగా అభ్యర్థిని ప్రకటిస్తే తామూ అదే దారిలో నడవాలని కాంగ్రెస్ అనుకుంటోంది. అదే సందర్భంలో బీజేపీని తట్టుకోవాలంటే అభ్యర్థి ఆర్థికంగానూ బలంగా ఉండాలని రెండు పార్టీలూ కోరుకుంటున్నాయి. అందుకే.. వెనుకబడిన వర్గాలకు చెంది.. ఆర్థికంగా బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్, టీఆర్‌ఎస్ జల్లెడ పడుతున్నాయి. సాధ్యం కాకుంటే సామాజిక వర్గంతో నిమిత్తం లేకుండా ఆర్థికంగా బలమైన అభ్యర్థిని ప్రకటించినా ఆశ్చర్యం లేదు.