రష్డీపై హత్యాయత్నం.. కన్ను కోల్పోయే ప్రమాదం
వివాదాస్పద రచయిత సల్మాన్ రష్డీపై హత్యాయత్నం జరిగింది. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన ఈ బ్రిటిష్-అమెరికన్ రచయిత ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు స్టేజీపైకి రాగానే ఓ దుండగుడు కత్తితో పొడిచాడు. 10-15 కత్తిపోట్లకు గురైన రష్డీ స్టేజీపైనే కుప్పకూలారు. నలుపు రంగు దుస్తులు ధరించిన దుండగుడు సల్మాన్‌పై కత్తితో 20 సెకన్ల పాటు ఆపకుం డా పొడిచాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. రష్డీ పరిస్థితి విషమంగానే ఉందని, ఒక కన్ను కోల్పోయే అవకాశం ఉందని, చేతి నరాలు తెగిపోయాయని, మెడ, పొత్తి కడుపుపై బలమైన దెబ్బలు తగిలాయని, కాలేయం కూడా దెబ్బతిన్నదని ఆయన ప్రతినిధి ఆండ్రూ వైలీ తెలిపారు.
రష్డీపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని హదీ మతర్(24)గా గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 1988లో ది సటానిక్ వర్సెస్
అనే నవల రాసిన రష్డీ దైవ దూషణకు పాల్పడ్డారని, ఆయనను హతమార్చాలని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖుమైనీ అప్ఫుడే ఫత్వా జారీ చేశారు. రష్డీని హత్య చేసిన వారికి ఇరాన్ ప్రభుత్వం రివార్డు కూడా ప్రకటించింది. దీంతో ఆయన పదేళ్ల పాటు అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లారు. 1990 నుంచి పోలీసు భద్రత మధ్య కాలం గడిపారు. 2000లో అమెరికాకు మకాం మార్చారు.