కేబినెట్ నిర్ణయాలు లీకులు చేస్తే కఠిన చర్యలే
తెలంగాణలో ప్రభుత్వ నిర్ణయాలు, కేబినెట్లో జరిగిన చర్చల సారాంశం ప్రతిపక్ష నేతలకు లీకుల ద్వారా చేరవేస్తున్న విషయంలో మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు . సెక్రటేరియట్లో మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత నిర్వహించిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ , కేబినెట్ నిర్ణయాలు , ప్రభుత్వ ముఖ్య నిర్ణయాల లీకుల విషయం మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఈ ఘటనలపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో కేబినెట్ సైతం ఒకే అభిప్రాయంతో ఉందని స్పష్టం చేశారు. కేబినెట్ నిర్ణయాలు అత్యంత గోప్యమైనవని, జీవోలు విడుదలకు ముందే వాటి వివరాలు బయటకు రావడం దారుణమైన విషయమని పేర్కొన్నారు.ఇటీవల కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు, చర్చల సారాంశం గులాబీ పార్టీలోని కొంతమంది నేతలకు వెంటనే చేరుతున్నట్టుగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో హైదరాబాద్‌లో ఉన్న పరిశ్రమలను ఔటర్ రింగ్‌రోడ్ అవతలకు తరలించాలని నిర్ణయించారు. ఇందుకోసం పరిశ్రమల శాఖ సిద్ధం చేసిన ‘హిల్టప్’ పాలసీకి ఆమోదం ఇచ్చారు. అయితే, ఈ పాలసీకి సంబంధించిన విధివిధానాలను ఆ శాఖ సెక్రటరీ ఆమోదించాక జీవో ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, ఆ దశకు ముందే కొందరు అధికారులు పాలసీ వివరాలను గులాబీ పార్టీలోని నేతలకు చేరవేసినట్టు ప్రచారం సాగుతోంది.ఈ వివరాల ఆధారంగా కేటీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. పరిశ్రమల భూముల బదిలీ పేరుతో లక్షల కోట్ల స్కామ్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు.ఈ విషయంపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు, లీకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

