టారిఫ్ భయాలతో నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు అమెరికా టారిఫ్ భయాలతో నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలకు దిగడం, అలాగే గ్లోబల్ టారిఫ్ భయాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు పాల్పడటం సూచీలపై ఒత్తిడిని పెంచాయి. ముఖ్యంగా కన్జూమర్ డ్యూరబుల్స్, రియల్టీ రంగ షేర్లలో అమ్మకాలు అధికంగా నమోదయ్యాయి. ఈ ప్రభావంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ ఒక దశలో దాదాపు 600 పాయింట్ల వరకు క్షీణించింది. అదే సమయంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 25,603 స్థాయికి పడిపోయి ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి మార్కెట్ కొంతమేర నష్టాలను తగ్గించుకున్నప్పటికీ, నష్టాల్లోనే ముగిసింది. సెన్సెక్స్ 250 పాయింట్లు తగ్గి 83,627వద్ద స్థిరపడగా, నిఫ్టీ 58 పాయింట్ల నష్టంతో 25,732 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 షేర్లలో ట్రెంట్, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండిగో, మారుతీ సుజుకి షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. మరోవైపు ఎటెర్నల్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, టీసీఎస్ షేర్లు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల విషయానికి వస్తే, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 64.91 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు ధర 4,582. 93 డాలర్ల వద్ద కొనసాగుతోంది. కరెన్సీ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.21 వద్ద నమోదైంది. గ్లోబల్ అనిశ్చితులు, ఎఫ్‌ఐఐల అమ్మకాలు, రంగాల వారీగా అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిసినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

