Andhra Pradesh

శ్రీవారి భక్తుడు శ్రీనివాస్ మొహంతి అరుదైన రికార్డు

తిరుమల: మనసర్కార్

కలియుగదైవం ఏడుకొండల స్వామిని దర్శించుకోవాలని భక్తులందరూ ఉవ్విళ్లూరుతూ ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా మెట్లమార్గంలో నడిచి వెళ్తూంటారు. ఏదైనా కోరికతో మొక్కుకుని ఆ మొక్కు తీర్చుకునే క్రమంలో నడిచి వెళ్లి దర్శనం చేసుకుంటారు. ఓ పరమ భక్తుడు ఏకంగా 350 సార్లు ఏడుకొండలూ ఎక్కివెళ్లి దర్శనం చేసుకున్నారు. ఆయనే మహంతి శ్రీనివాస్. శ్రీకాకుళానికి చెందిన ఈయన 780 మందితో తిరుమలకు పాదయాత్ర చేసి ఏషియాబుక్ ఆఫ్ రికార్డులో కూడా చోటు సంపాదించుకున్నారు. ఈయనకు శ్రీవారంటే ఎనలేని భక్తి. సెప్టెంబరు 6 వతేదీ ఏకాదశి రోజున తిరుమలకు నడిచి వెళ్లాలని నిశ్చయించుకుని, ముందుగానే గోవింద వరల్డ్ వైడ్ అనే వాట్సాప్ గ్రూప్‌ను రూపొందించారు. దానిలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని సభ్యులుగా చేర్చుకుని వారిలో ఆసక్తి ఉన్నవారిని తనతో మెట్లమార్గం ద్వారా పాదయాత్రకు రావాలని కోరారు. అలా అందరూ 5 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతిలో సమావేశమై 6 వతేదీని నడచి తిరుమలను చేరుకున్నారు. వీరు కర్నాటక, ఆంధ్ర, తెలంగాణా, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 780 మంది 2388 మెట్లను 150 నిమిషాలలో నడిచి తిరుమలకు వెళ్లారు. ఇది ఆయన 350 వ పాదయాత్ర. దీనితో ఆయన రికార్డు సాధించారు.

రుంకు అప్పారావు అనే తిరుమలలో పనిచేసిన ఉన్నతాధికారి స్ఫూర్తితో ఈ పాదయాత్రలు చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. అప్పారావు 108 సార్లు పాదయాత్ర చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు పొందారని, ఆయన స్ఫూర్తితోనే తాను కూడా ఈ పాదయాత్రలు మొదలు పెట్టానని చెప్పారు. శ్రీనివాస్ కూడా 205 పర్యాయాల అనంతరం ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించారు. ఈ సర్టిఫికేట్ అప్పటి ఈఓ అనిల్ సింఘాల్ చేతుల మీదుగా అందుకున్నారు. తిరిగి ఈ యాత్రను సాగిస్తూ 258 పర్యాయాల వద్ద 2020 మే 8న ఏషియాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారు. అలాగే టిటిడి వారి సప్తగిరి మాస పత్రికలో శ్రీనివాస్‌పై వ్యాసం కూడా ప్రచురించారు.

1996లో మొదటిసారి నడిచి వెళ్లిన ఆయన 1996 నుండి 2016 వరకు 85 సార్లు వెళ్లారు. 2017లో ఆయన 50 ఏళ్ల వయస్సు సందర్భంగా 50 సార్లు నడిచి వెళ్లారు. ఇలా ఒకరోజులో ఒకసారి 193 సార్లు, రెండుసార్లు నడిచింది 142 సార్లు, మూడుసార్లు నడిచింది 15 సార్లుగా ఉంది. ఆయనే కాదండోయ్. ఆయన భార్యకూడా 59 సార్లు, కుమారుడు 30 సార్లు పాదయాత్రలు చేయడం విశేషం. ఇప్పటి వరకూ రెండువేల మందిని తనతో పాటుగా తీసుకెళ్లారట ఈయన.

తిరుమల అంటే సాక్షాత్తూ వైకుంఠమేనని, తనకు స్వామిని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదని చెప్తున్నారు ఈ పరమభక్తుడు. పురాణాలలో వినడమే కానీ ఇలాంటి భక్తులను చూడడం నిజంగా చాలా అరుదైన విషయం.