మంత్రి పెద్దిరెడ్డికి శ్రీశైలం ఈవో పాదాభివందనం
అధికారుల పని అధికారులు చేయాలి… ప్రభుత్వం పెద్దల పని ప్రభుత్వ పెద్దలు చేయాలి. కానీ కొన్నిసార్లు… అధికారులు, ప్రభుత్వ పెద్దల మధ్య పని సంథింగ్ తేడాగా మారుతుంటుంది. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ ఈవో ఎస్ లవన్న పాదాభివందనం చేయడం విమర్శలకు కారణమవుతోంది. స్వామి దర్శనం కోసం వచ్చిన పెద్దిరెడ్డి… గోపురం వద్దకు రాగానే.. ఈవో లవన్న పూలమాల వేసి స్వాగతం పలికేందుకు ప్రయత్నించారు. ఐతే ఆయన అందుకు తిరస్కరించడంతో… ఈవో మంత్రి పాదాలకు నమస్కరించారు. ఈ మొత్తం వ్యవహారంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. శివదీక్షలో ఉన్న ఆఫీసర్, మంత్రి కాళ్లకు మొక్కడమేంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం వ్యవహారం మీడియాలో సంచలనం కావడంతో… ఈవో లవన్న వివరణ ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డిది, తనది ఒకే మండలమన్నారు. అంతే కాదు మంత్రి పెద్దిరెడ్డి 75 సార్లు అయ్యప్ప, శివదీక్షలు తీసుకున్నారన్నారు. తాను కూడా 17 సార్లు అయ్యప్ప మాల ధరించానన్నారు. పెద్దిరెడ్డిని గురస్వామిగా భావించి పాదాభివందనం చేశానని… ఆ ప్రాంతం కూడా కృష్ణదేవరాయ గోపురం బయటే ఉందంటూ వివరణ ఇచ్చుకున్నారు.


