Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

అసభ్యకర ప్రచారాలపై ప్రత్యేక దర్యాప్తు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రెండు వేర్వేరు కేసుల విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. నారాయణపేట జిల్లా మద్దూర్ ,హైదరాబాద్ సీసీఎస్‌లో నమోదైన ఈ కేసుల లోతుపాతులను వెలికితీసే బాధ్యతను హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు అప్పగించింది. ఈ మేరకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్‌రెడ్డి అధికారిక ఉత్తర్వులు మంగళవారం జారీ చేశారు.

మద్దూర్ పరిధిలో కావలి వెంకటేశ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి ఫోటోలను అసభ్యకరంగా రూపొందించి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. దీనిపై కాంగ్రెస్ నేత గూళ్ల నరసింహ ఇచ్చిన ఫిర్యాదుతో ఈనెల 11న కేసు నమోదైంది. మరోవైపు, ఒక మహిళా ఐఏఎస్ అధికారిణిని కించపరుస్తూ తప్పుడు ప్రచారాలు చేసిన వ్యవహారంలో ఐఏఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు సీసీఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో రెండు తెలుగు న్యూస్ ఛానళ్లతో పాటు ఏడు యూట్యూబ్ ఛానళ్లపై బీఎన్‌ఎస్ 75, 78, 79, 351(1), 351(2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

సీపీ సజ్జనార్ నేతృత్వంలోని ఈ బృందంలో నార్త్ రేంజ్ జాయింట్ సీపీ శ్వేత, చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్, హైదరాబాద్ అడ్మిన్ డీసీపీ వెంకటలక్ష్మి, సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, విజిలెన్స్ అదనపు ఎస్పీ ప్రతాప్, సీసీఎస్ ఏసీపీ గురు రాఘవేంద్ర, సైబర్‌సెల్ ఇన్‌స్పెక్టర్ శంకర్ రెడ్డి, సైబర్‌సెల్ ఎస్సై హరీశ్ ఉన్నారు. ఈ బృందం తక్షణమే రంగంలోకి దిగి దర్యాప్తును వేగవంతం చేయనుంది.