స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ నిర్ణయం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టని , రక్షించాల్సిన శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసినా అనర్హత వేటు పడకపోవడం సిగ్గుచేటని, రాజ్యాంగ వ్యవస్థలను కాంగ్రెస్ తన కార్యాలయంలో బంధించాలని చూస్తోందని బండి సంజయ్ ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని, గాంధీ భవన్లో ప్రచారం చేసినా వారు పార్టీ ఫిరాయించలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. స్పీకర్ స్వతంత్రంగా వ్యవహరించాలి తప్ప, గాంధీ కుటుంబానికి తాబేదారులా ఉండకూడదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ అప్రజాస్వామిక నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తాము హైకోర్టును ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు. గతంలో బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితుల్లో న్యాయస్థానాలు మొట్టికాయలు వేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని, తెలంగాణలోనూ ఫిరాయింపుదారులకు కోర్టులో చుక్కెదురు కావడం ఖాయమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల సమయంలో దానం నాగేందర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినట్లు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోని ఆధారాలను కూడా ఆయన ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అందరూ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

