NationalNews

సూర్య గ్రహణం ఎఫెక్ట్‌.. ఆలయాల మూసివేత

సూర్య గ్రహణం కారణంగా తిరుమలలోని శ్రీవారి ఆలయాన్నిఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు మూసివేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌తో పాటు అన్నదానం, లడ్డూ కాంప్లెక్స్‌లను మూసివేశారు. శ్రీవారి ఆలయంలో 18 గంటల పాటు దర్శనాలను రద్దు చేశారు. గ్రహణం విడిచిన తర్వాత పుణ్యాహవచనం, ఆలయ శుద్ధి నిర్వహించి.. స్వామి వారికి పూజలు చేసి.. రాత్రి 9 గంటల నుంచి భక్తులను స్వామి వారి దర్శనం కోసం అనుమతిస్తారు. చంద్ర గ్రహణం కారణంగా నవంబరు 8వ తేదీన కూడా శ్రీవారి ఆలయాన్ని ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు మూసివేస్తారు. గ్రహణాల రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో బ్రేక్‌ దర్శనాలు, వీఐపీ ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

యాదాద్రి ఆలయంలో అన్ని కార్యక్రమాలు రద్దు..

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి ఆలయాన్ని ఉదయం 8 గంటల 50 నిమిషాల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు మూసివేస్తారు. లక్ష్మినరసింహ స్వామి వారి నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలను రద్దు చేశారు. బుధవారం స్వాతి నక్షత్రం సందర్భంగా నిర్వహించే శతఘట్టాభిషేకం, సహస్రనామార్చనను సైతం రద్దు చేశారు. బుధవారం ఉదయం సంప్రోక్షణ నిర్వహించి ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఆలయాన్ని తెరిచి నిత్య కైంకర్యాలను ప్రారంభిస్తారు. విజయవాడలోని దుర్గగుడితో పాటు ఉపాలయాలను ఉదయం 11 గంటల నుంచి మూసివేశారు. ప్రదోష కాంలో నిర్వహించే సేవలనూ రద్దు చేశారు.

తెరిచి ఉంచే శ్రీకాళహస్తి ఆలయం

శ్రీకాళహస్తి రాహు కేతు క్షేత్రం. దీంతో ఈ ఆలయంలో గ్రహణ సమయంలోనూ పూజలు యథావిధిగా కొనసాగుతాయి. భూమికి వెలుగు పంచే సూర్య, చంద్రులను రాహు కేతువు మింగివేయడమే గ్రహణం. దీన్ని ప్రజలు అశుభంగా భావిస్తారు. రాహు కేతువులు చెడు గ్రహాలు కావడం వల్ల వాటి నుంచి వెలువడే విష కిరణాలు ఆలయాలపై వ్యతిరేక ప్రభావం చూపిస్తాయి. అయితే.. శ్రీకాళహస్తి ఆలయం రాహు కేతు క్షేత్రం కావడంతో దాన్ని గ్రహణం రోజు తెరిచే ఉంచుతారు. కాళహస్తి శివలింగంపై ఓ కవచం ఉంటుంది. ఆ కవచంలో ఉండే 27 నక్షత్రాలు, 9 రాశులు సౌర కుటుంబాన్ని కంట్రోల్‌ చేస్తాయని ఆలయ పండితులు చెప్పారు. కవచంలో అన్ని గ్రహాలు ఉండటం వల్ల వాటిపై లయకారకుడు ఆధిపత్యం కలిగి ఉంటాడని.. అందుకే గ్రహణ ప్రభావం ఆలయంపై పడదని పేర్కొన్నారు. రాహు కేతు దోషం కలిగిన వారు గ్రహణ సమయాల్లో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు.

తెరిచే ఉండే మరిన్ని ఆలయాలు..

గ్రహణ సమయంలో మరిన్ని ఆలయాలు తెరిచే ఉంటాయి.. కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర ఆలయం కూడా తెరిచే ఉంటుంది. అక్కడి ధృవమూర్తులకు గ్రహణ సమయంలో శాంతి అభిషేకాలు నిర్వహిస్తారు. అరుణ హోమం కూడా చేపడతారు. కేరళలోని తిరువరుప్పు క్షేత్రం, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయాలపైనా గ్రహణ ప్రభావం చూపదు. గ్రహణం సమయంలో ఉజ్జయిని మహంకాళి ఆలయ ప్రధాన ద్వారాన్ని తెరిచే ఉంచుతారు. శివలింగాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ తాకనివ్వరు. గ్రహణ సమయంలో పూజ, అభిషేకాలను మాత్రం నిలిపివేస్తారు.