విమానంలో సిగరెట్ స్మోకింగ్… DGCA సీరియస్…
ఇటీవల విమాన ప్రయాణాలు హైలెట్‌గా నిలుస్తున్నాయి. కొందరి వల్ల తోటి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు నిబంధనలను అతిక్రమిస్తున్నారు. ఓ ప్రయాణికుడు చేసిన పనిని.. చూసిన వారు విస్మయానికి గురౌతున్నారు. గత జనవరి 23న దుబాయ్ నుండి ఢిల్లీకి వస్తున్న స్పైస్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ SG 706 విమానంలో దర్జాగా పడుకుని సిగరెట్ తాగుతూ ఫోటోలకు ఫోజులిచ్చాడు ఓ వ్యక్తి. కాలి మీద కాలు వేసుకుని సిగరెట్ కాల్చాడు. అతడి ప్రవర్తనతో తోటీ ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అసలు విమానంలో సిగరెట్ తాగటం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ట్విట్టర్ ద్వారా ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై సీరియస్ అయిన మంత్రి సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఆ వ్యక్తి ఎవరో అని అనుకుంటున్నారా..? గుర్గావ్‌కు చెందిన బాబీ కటారియా. ఆయన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరుపొందిన వ్యక్తి. ఆయనకి దాదాపు ఆరున్నర లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లు ఉన్నారు. గతంలో కూడా బాబీ కటారియా పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇటీవల డెహ్రడూన్ రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని మందు తాగాడు. దీనికి సంబంధించిన వీడియోను కూడా అతడు తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపైనా గతంలో కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. విమానంలో స్మోకింగ్ చేయడం నిషేదం ఉందని తెలిసి కూడా సిగరెట్ కాల్చాడు. విమానంలో అగ్ని ప్రమాదం సంభవిస్తే.. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉండేది. అందుకే అతడిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.